Wednesday, December 4, 2024

బందీలను విడిచిపెట్టకపోతే నరకం చూపిస్తా

- Advertisement -
- Advertisement -

తాను అధికార బాధ్యతలు చేపట్టక ముందే బందీలను విడిచిపెట్టాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హమాస్ మిలిటెంట్లకు హెచ్చరించారు. హమాస్ మిలిటెంట్లు తమ చెరలోని బందీలకు సంబంధించిన వీడియోను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. “ నేను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తాను. ఈలోపు బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తాను. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. వెంటనే బందీలను విడుదల చేయండి” అని ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కస్సామ్ బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది.

అందులో అమెరికాఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు. అందులో ‘ నేను గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నాను. మేమంతా భయంతో రోజుకు వెయ్యిసార్లు చస్తున్నాం. మమ్మల్ని త్వరగా విడిపించండి ’ అని అలెగ్జాండర్ అభ్యర్థించాడు. ఈ వీడియోపై బాధితుడి తల్లి స్పందించి , ఎడాన్‌తో బందీలందరి విడుదలకు ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ క్రమం లోనే డొనాల్డ్ ట్రంప్ ఈమేరకు హెచ్చరించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజా లోకి తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పు విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలయ్యారు. తర్వాత పలు సంఘటనల్లో మరికొందరు మృతి చెందగా, ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News