అమెరికాలోకి ప్రవేశించే అధిక నైపుణ్యం గల కార్మికులకు తోడ్పడే ప్రత్యేక వీసా కార్యక్రమాన్ని తాను సమర్థిస్తున్నానని అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ శనివారం వెల్లడించారు. ఆ వీసాపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ వంటి తన సాంప్రదాయక మద్దతుదారులు, టెక్ దిగ్గజాలకు ట్రంప్ అండగా నిలిచారు. ‘నేను ఎల్లప్పుడూ (హెచ్1బి) వీసాలను ఇష్టపడ్డాను. నేను సదా వీసాలకు సానుకూలం. అందుకే వారిని కలిగి ఉన్నాను’ అని ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో చెప్పారు. ఈ వారం ఈ వివాదం మొదలైన తరువాత దీనిపై ట్రంప్ చేసిన మొదటి బహిరంగ వ్యాఖ్యలు అవి. అమెరికాలోకి వలసలపై తీవ్ర ఆంక్షలు విధించాలని ట్రంప్ తరచు పిలుపు ఇస్తుండడం నవంబర్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆయన ఎన్నికల విజయానికి ప్రధాన కారణం. పత్రాలు లేని వలసవాదులను అందరినీ తిరిగి పంపించివేస్తానని, చట్టబద్ధమైన వలసను పరిమితంచేస్తానని ఆయన శపథం చేశారు.
అయితే, అమెరికా అధిక నైపుణ్యం గల పట్టభద్రులు చాలా కొద్ది మందినే తయారు చేస్తుంటుందని, తాము హెచ్1బి కార్యక్రమానికి గట్టి మద్దతు ప్రకటిస్తున్నామని టెస్లా మస్క్ వంటి టెక్ వాణిజ్యవేత్తలు, వివేక్ రామస్వామి చెబుతున్నారు. ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ వ్యయ కుదింపు కమిటీకి మస్క్‌తో పాటు వివేక్ సారథ్యం వహిస్తున్నారు. స్వయంగా హెచ్1బి వీసాపై దక్షిణాఫ్రికా నుంచి వలస వచ్చిన మస్క్ గురువారం ‘ఎక్స్’ వేదికపై ఒక పోస్ట్ చేస్తూ, విదేశాల నుంచి ఉన్నత ఇంజనీరింగ్ నిపుణులను ఆకర్షించడం ‘అమెరికా పైచేయి కావడానికి ప్రధానం’ అని సూచించారు. భారత్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన వివేక్ రామస్వామి చేసిన ఒక పోస్ట్ ఆ చర్చపై వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ‘అమెరికన్ సంస్కృతి’ పసలేని వారిని ప్రోత్సహిస్తుంటుందని ఆయన ఆక్షేపించారు. ‘చైనాకు మనకు అందజేసిన అసమర్థులను’ కలిగి ఉండడం అమెరికాకు ముప్పు అని వివేక్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రముఖ సంప్రదాయవాదులకు ఆగ్రహం కలిగించింది.