Saturday, November 16, 2024

తిట్లు, శాపనార్థాలే ‘ట్రంప్’ కార్డ్!

- Advertisement -
- Advertisement -

‘ఈసారి నేను గెలవకపోతే రక్తపాతమే’నంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోనీ అంతటితో ఆగారా అంటే, ఈసారి తాను గెలవకపోతే అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ట్రంప్ మహాశయుడి వాచాలత్వం ప్రజాస్వామికవాదులను ఒకింత ఆందోళనకు గురి చేసి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా, కొన్ని దేశాలకు తలలో నాలుకగా వ్యవహరిస్తున్న అమెరికాలో ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడుతున్నాయన్న దాఖలాలు 2017లో ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడే అర్థమైంది. నోటికి హద్దూ పద్దూ లేకుండా, బరితెగించి మాట్లాడటంలో.. మరోసారి అధ్యక్ష పదవికి బరిలోకి దిగిన ట్రంప్ ముందు అందరూ దిగదుడుపే. ఇప్పటివరకూ అగ్రరాజ్యాన్ని ఏలిన అధ్యక్షులలో ఎవరూ ఇంతలా దిగజారి మాట్లాడిన దాఖలాలు లేవు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న కొన్ని ఆసియా దేశాలలో ప్రత్యర్థి పక్షాల అభ్యర్థులు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, వ్యక్తిగత ఆరోపణలకు దిగజారడం సాధారణం.

ఈ సంస్కృతి ఇప్పుడు అమెరికాకు సైతం పాకడమే వింతగొలిపే విషయం. ఒక విధంగా 2024ను ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు.కొన్ని పెద్ద దేశాలు ఈ ఏడాదే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. పాకిస్తాన్, రష్యాలలో ఇటీవలే ఎన్నికలు ముగియగా, అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియా ఏప్రిల్, మే నెలల్లో ప్రజా తీర్పుకు సిద్ధమవుతోంది. అమెరికా, దక్షిణాఫ్రికాలతో పాటు బ్రిటన్‌లోనూ ఈ ఏడాదే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిలో అందరినీ ఆకర్షిస్తున్నవి అమెరికా ఎన్నికలే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు 77 ఏళ్ల డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు 81 ఏళ్ల జో బైడెన్ ల మధ్య ఈసారి ఒక రకంగా జుగుప్సాకరమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రత్యర్థికి దీటుగా ఆరోపణలు గుప్పించకపోతే వెనుకబడిపోతామేమోననే భయంతో బైడెన్ కూడా దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారు.‘అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరు మరీ వృద్ధుడు, మానసికంగా అసమర్థుడు’ అంటూ ఆయన ట్రంప్ పై చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఈ కోవకు చెందినవే.

వయసులో ట్రంప్ కంటే నాలుగేళ్లు పెద్దయిన బైడెన్ ఇలా మాట్లాడతారని డెమోక్రాటిక్ పార్టీ నేతలు సైతం ఊహించి ఉండకపోవచ్చు. వాస్తవానికి పలు ప్రైమరీలలో గెలిచి, పార్టీలో తన ప్రత్యర్థి నిక్కీ హేలీని పక్కకునెట్టి రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖాయం చేసుకున్న ట్రంప్ పై అలముకున్న నీలినీడలు ఇంకా తొలగిపోలేదు.2021 జనవరిలో క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడి కేసులో ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు తుది వాదనలు విని తీర్పు చెప్పే అవకాశం ఉంది. ట్రంప్ దోషిగా తేలితే, మరోసారి అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవాలన్న ఆయన ఆశలు అడియాసలైనట్టే. ప్రత్యర్థులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడే ట్రంప్ జీవితం వివాదాలమయం. ఆయనపై అనేక కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. క్యాపిటల్ హిల్ దాడి కేసుతో పాటు అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ప్రేమాయణం నెరపి, ఆ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఎర చూపారన్న కేసు కూడా నడుస్తోంది.

ఇవి గాక రియల్ ఎస్టేట్ కుంభకోణంతో పాటు అనేక ఇతర కేసులలోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నవారెవరూ దేశాధ్యక్ష పదవికి పోటీపడిన దాఖలాలు లేవు. ఇటీవల బస్టిన్ వాన్, బ్రాండన్ రోటింగ్ హాస్ వంటి 154 మంది రాజకీయ విశ్లేషకులు నిర్వహించిన ఒక సర్వేలో ఇప్పటి వరకూ అమెరికాకు అధ్యక్షులుగా పని చేసిన 45 మందిలో అత్యంత చెత్త అధ్యక్షుడు ట్రంపేనని తేలడం ఆయన సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. కానీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ప్రజాస్వామిక విలువల్ని పాతరేస్తూ, ప్రత్యర్థులను వ్యక్తిగత దూషణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ‘మునుముందుకు’ సాగిపోతున్న ట్రంప్ తీరు ఆద్యంతం ఆందోళనకరం.. అంతకు మించి ప్రజాస్వామ్యానికి అవమానకరం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News