వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడానికి అనర్హుడని పేర్కొంటూ కొలరాడో సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2021లో అమెరికా రాజధానిపై అనూహ్య రీతిలో జరిగిన దాడిలో ఆయన పాత్రను సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ కొలరాడో రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన ప్రాథమిక బ్యాలట్‌లో ఆయన పేరును చేర్చరాదని ఆదేశించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఆధారంగా 77 ఏళ్ల మాజీ అధ్యక్షుడు ట్రంప్ రెండవ సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అమెరికా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వారు తిరుగుబాటుకు పాల్పడితే భవిష్యత్‌లో అద్యక్ష పదవిని చేపట్టడానికి అనర్హులవుతారని ఈ 14వ సవరణ నిర్దేశిస్తోంది.
కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రం వెలుపల వర్తించదని తెలుస్తోంది. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ట్రంప్ సిద్ధపడుతున్నారు. నామినేషన్ ప్రక్రియకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా..కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ట్రంప్ కార్యాలయం నిర్ణయించింది. 2021 జనవరి 6న జో బైడెన్ చేతిలో ఓటమిపాలైన ట్రంప్ తిరుగుబాటుకు పాల్పడినట్లు కొలరాడో సుప్రీంకోర్టు నిర్ధారిఇచింది. తనపై విధించిన నిషేధం అధ్యక్ష ఎన్నికకు వర్తించదన్న ట్రంప్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.