వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్ లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) పరిహారం చెల్లించాలని కోర్టు ట్రంప్‌ను ఆదేశించింది. కొన్నేళ్ల క్రితం ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని కారోల్ ఆరోపణలు చేసింది. 1990లో మాన్‌హటన్ అవెన్యూ లోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జీన్ కారోల్ ఆరోపించింది.
ఇది కాక 2019లో ఓ సారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్ డాలర్లతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ జరిమానాపై ట్రంప్ స్పందిస్తూ బైడెన్ ప్రభుత్వం పై తీవ్రవిమర్శలు చేశారు. ఈ తీర్పు హాస్యాస్పదమన్నారు. న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని, దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.