వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ సమీపాన ఉన్న ఒక ద్వీపంలోని తన సొంత విలాసవంతమైన మారలాగో ఎస్టేట్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం వైట్‌హౌస్‌కు ట్రంప్ గుడ్‌బై చెబుతుండడంతో మారలాగో ఎస్టేట్‌కు ట్రక్కులలో ట్రంప్ సామాన్లు చేరుకోవడం కనిపించినట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. అమెరికా నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగానే బుధవారం ఉదయమే మారలాగోకు విమానంలో పయనమవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు పత్రిక తెలిపింది.
తన నాలుగేళ్ల అధ్యక్ష పదవీకాలంలో ట్రంప్ మారలాగో ఎస్టేట్‌లో చాలాకాలమే గడిపారు. ఈ ఎస్టేట్‌ను శీతాకాల వైట్‌హౌస్‌గా అధికారులు అభివర్ణించేవారు. న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్‌లో ఉన్న తన అధికారిక నివాసాన్ని కూడా ఆయన 2019 సెప్టెంబర్‌లో మారలాగోకు మార్చారు. అట్లాంటిక్ మహాసముద్రానికి అభిముఖంగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎస్టేట్‌ను పోస్టమ్ సిరియల్ కంపెనీ వారసురాలు మార్జోరీ మెరివెదర్ పోస్ట్ 1927లో నిర్మించారు. ఈ ఎస్టేట్‌లో 128 గదులు, 20వేల చదరపు అడుగుల బాల్‌రూమ్, ఐదు టెన్నిస్ కోర్టులు, ఒక స్విమ్మింగ్ పూల్ తదితర అనేక విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఫ్లోరిడాలోనే రెండవ అతిపెద్ద ఎస్టేట్‌గా పేరున్న ఈ ఎస్టేట్‌లో ట్రంప్‌కు విడిగా నివాస భవనాలు ఉన్నాయి.
Donald Trump lives at Florida Estate