తొలిరోజే భారతీయులపై బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికాలోని భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ ఎగ్జిక్యూటివ్
ఆర్డర్ అమెరికాలో 50లక్షల మంది భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలరోజే బాంబ్ లాంటి నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా పౌరసత్వం విషయంలో కీలక మార్పులు చేస్తున్న ట్లు ప్రకటించారు. అమెరికా గడ్డపై పుట్టిన వారికి ఆటోమాటిక్ గా సిటిజ న్ షిప్ కల్పించే నిబంధనలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతీయులపై ఏమేరకు ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. అమెరికాకు వలస వచ్చే వారికి విషయంలో కీలక మైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తొలి ప్రసంగంలోనే ట్రంప్ ప్రకటించారు. ఇమిగ్రేషన్ చట్టాలలో మార్పులు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసారు. అమెరికాలో ఏ దంపతులైనా వారు ఏదేశానికి చెందిన
వారైనా వారు అమెరికా లో బిడ్డను కంటే.. అతడు ఆ బిడ్డ అమెరికా సిటిజన్ అవుతాడు. అమెరికా సిటిజన్ షిప్ అతడి బర్త్ రైట్. ఈ విషయంలో ట్రంప్ కొత్త ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వివాదాస్పదమైంది. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం అమెరికాకు వలసవచ్చిన వారు ఏ దేశస్తులైనా, అమెరికాలో బిడ్డను కంటే.. అ బిడ్డకు ఆటోమాటిక్ గా పౌరసత్వం లభిస్తుంది. 1868లో ఈ సవరణ చేశారు. కానీ, ట్రంప్ చేసిన కొత్త ఆదేశం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చిన సమయానికి ఆ తల్లిదండ్రులు అమెరికన్ పౌరులు కాకపోయినా, వారు చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ, గ్రీన్ కార్డ్ కలిగి ఉండకపోతే..
ఆ బిడ్డకు ఆటోమాటిక్ గా పౌరసత్వం రాదు. బిడ్డ తండ్రి శాశ్వత నివాసి అయినా, తల్లి తాత్కాలిక వీసా పై అమెరికాలో ఉన్నా ఇదే నిబంధన వర్తిస్తుంది. ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్షలాది మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం పడుతుంది. అమెరికాలో ఏళ్ల తరబడి నివసిస్తూన్నా.. ఇప్పటికీ దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ట్రంప్ నిర్ణయం వలసదారులను గందరగోళంలో పడేసేందుకే ఉపయోగపడుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విధానం వల్ల భవిష్యత్ లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, వలసదారులు పనిచేసే కార్యాలయాలు, మొత్తం వివిధ దేశాలకు చెందిన వలసదారులు అందరిపై పడుతుందని అంటున్నారు. ఈ విధానంలో మార్పు చేస్తూ జారీ అయ్యే ఆర్డర్ 30 రోజుల్లో అమలులోకి వస్తుంది. ఆ ఆర్డర్ ను న్యాయస్థానాలలో సవాల్ చేసే అవకాశం ఉంది. అమెరికా సెన్సెస్ బ్యూరో ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 50 లక్షల భారతీయ అమెరికన్లు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికా జనాభాలో వారు 1.47 శాతం. భారతీయ అమెరికన్లలో కేవలం 34 శాతం మందే అమెరికాలో జన్మించినవారు. మూడింట రెండు వంతుల మంది వలసదారులే.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ జాతీయులలో చాలా మంది హెచ్ 1 బి వీసాతో నివసిస్తున్నారు. వందలాది మంది భారతీయలకు కలిగిన పిల్లలు అమెరికాలో జన్మించినవారే. ట్రంప్ ఆదేశం ప్రకారం వారందరికీ ఆటో మాటిక్ గా సిటిజన్ షిప్ లభించదు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పట్ల అమెరికా పౌర హక్కుల యూనియన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగం 14 వ సవరణ స్పష్టంగా సిటిజన్ షిప్ బర్త్ రైట్ అని పేర్కొన్న విషయాన్ని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల సామూహికంగా వలసదారులు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని. మానవహక్కుల ఉల్లంఘన జరిగే ప్రమాదం ఉందని పౌర హక్కుల యూనియన్ హెచ్చరించింది.ట్రంప్ చేపట్టిన ఇమిగ్రేషన్ సంస్కరణల వల్ల లక్షలాది మంది భారతీయులతో సహా వలసదారుల భవిష్యత్ గందరగోళం లో పడే ప్రమాదం ఉంది.చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం, సమానత్వ సూత్రాలను సమర్థించే న్యాయవాదులు, చట్టసభ సభ్యులు, న్యాయస్థానాల నిర్ణయంపై వలసదారుల ముఖ్యంగా భారతీయుల భవిష్యత్ ఆధారపడి ఉంది.
ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు
పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి మరోసారి వైదొలిగిన అమెరికా
జనవరి 6వ తేదీన జరిగిన క్యాపిటల్ హిల్స్ దాడుల దోషులకు క్షమాభిక్ష
వాక్ స్వాతంత్య్రం పునరుద్ధరణ
టిక్‌టాక్ సేవల గడువు మరో 90 రోజులు పొడిగింపు
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్పు
డిఇఐఎ కార్యక్రమానికి గుడ్‌బై
స్త్రీ,పురుషులకే గుర్తింపు.. థర్డ్ జెండర్ గుర్తింపు లేదు
ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్‌బై
అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి
అమెరికాలో పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా లభించే పౌరసత్వానికి స్వస్తి
బైడెన్ హయాంలో జారీ చేసిన 78 ఉత్తర్వులు రద్దు