అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఆయన శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువ షూటర్ అతి దగ్గరి నుంచే ఆయనపై కాల్పులు జరిపాడు. ఓ వైపు ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా బుల్లెట్లు వచ్చి ఆయన కుడిచెవిని తాకుతూ దూసుకువెళ్లాయి. చెవికి గాయమై రక్తస్రావం అయింది. దీనితో ట్రంప్ కిందపడిపోవడం, వెంటనే ఆయన బాడీగార్డ్, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యింది. ఆయనకు రక్షణ వలయంగా నిలిచింది. మరో వైపు కాల్పులకు దిగిన వ్యక్తిని సీక్రెట్ సర్వీసెస్ బలగాలు అక్కడికక్కడే కాల్చిచంపాయి. నవంబర్‌లో జరిగే అమెరికా దేశాధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆయన స్వీకరించడానికి అతి కొద్ది రోజుల ముందే ఇప్పుడు ఆయనపై దాడి జరగడం కలకలం సృష్టించింది. పెన్సిల్వేనియాలోని బట్లెర్ టౌన్‌లో కిక్కిరిసిపోయి ఉన్న బహిరంగ సభలో 78 ఏండ్ల ట్రంప్ ఆవేశంగా మాట్లాడుతూ ఉండగా జనంలో ఉన్న వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.
నేరుగా ట్రంప్ ముఖానికి గురిపెట్టే దుండగుడు కాల్పులు జరిపినట్లు, ఈ దశలోనే ట్రంప్ తన ముఖాన్ని పక్కకు తిప్పడంతో బుల్లెట్లు చెవిని తాకుతూ వెళ్లినట్లు వీడియో ద్వారా వెల్లడైంది. భద్రతా సిబ్బంది ట్రంప్‌ను పట్టుకుని తీసుకువెళ్లుతున్న దశలోనే ఆయన కిందకు వాలాడు. సభకు వచ్చిన జనం ఆగంతకుడు తుపాకీ గురిపెట్టడాన్ని గుర్తించి పెద్ద ఎత్తున అరవడం, గెట్‌డౌన్ అంటూ ట్రంప్‌ను సభావేదికపై ఉన్నవారిని హెచ్చరించడంతో ట్రంప్ కూడా అప్రమత్తం అయినట్లు వెల్లడైంది. కాగా పక్కకు దూసుకువెళ్లిన బుల్లెట్ ఒక్కటి వేదిక వెనుక ఉన్న వ్యక్తికి తాకడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యి చనిపోయ్యాడు. ఇద్దరికి గాయాలు అయ్యాయని వెల్లడైంది. కాల్పుల ఘటనతో జనంలో కలకలం చెలరేగింది. ఓ వైపు కుడిచెవి నుంచి రక్తం కారుతూ ఉండగా ట్రంప్ వేదిక నుంచి నిష్క్రమిస్తూనే ట్రంప్ గాలిలోకి పిడికిలి ఎత్తి గుంపును ఉద్ధేశించి ఫైట్ అని అరిచాడు. వెంటనే ట్రంప్‌ను భద్రతా బలగాలు పిట్స్‌బర్గ్ ఆసుపత్రికి తరలించారు.
కాల్పులకు దిగిన వ్యక్తి థామస్ మాథ్యూ క్రూక్
సమీపంలోని భవనంపై నుంచి కాల్పులు ?
ట్రంప్‌పై హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తిని అధికారులు గుర్తించారు. ఈ వ్యక్తి 20 సంవత్సరాల మాథ్యూ క్రూక్స్ అని, స్థానిక బెతెల్ పార్క్ నివాసి అని ఎఫ్‌బిఐ నిర్థారించింది. ఈ వ్యక్తి రిపబ్లికన్ ఓటరుగా నమోదు చేసుకున్నట్లు గుర్తించారు. సమీపంలోని అమెరికన్ గ్లాస్ రిసర్చ్ బిల్డింగ్ పై నుంచి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఘటన తరువాత కొద్ది సేపటికి ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియాలో స్పందించారు. తనపై జరిగిన దాడి , గాయాల గురించి వివరించారు. మన దేశంలో ఇటువంటి హేయమైన ఘటన జరగడం దురదృష్టకరం అని , దాడికి దిగిన వ్యక్తి ఎవరనేది వివరాలేమిటి అనేది తనకు సమాచారం లేదని తెలిపారు. ఈ వ్యక్తి కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిసిందని, ఈ వ్యక్తి కుటుంబానికి సంతాపం తెలియచేస్తున్నానని తెలిపిన ట్రంప్ సభకు హాజరైన వారిలో కొందరు గాయపడ్డారని తెలిసిందని, వారు కోలుకోవాలని ఆశించారు. తన చర్మంలో నుంచి బుల్లెట్ వెళ్లిందని తెలిపిన ట్రంప్ గాడ్ బ్లెస్ అమెరికా అని వ్యాఖ్యానించారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కాల్పుల ఘటన జరిగిందని ఎఫ్‌బిఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ తెలిపారు. అసలేం జరిగింది? వివరాలను పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నామని పీటర్స్‌బర్గ్ కార్యాలయం నుంచి ఈ అధికారి ప్రకటించారు.
దుండగుడు ఎఆర్ స్టైల్ రైఫిల్‌తో ట్రంప్‌పై 200 నుంచి 300 అడుగుల లోపు దూరం నుంచే కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఘటనను అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఖండించారు. జాతిని ఉద్ధేశించి మాట్లాడారు. ఇటువంటి ఘటనలు ఇంతకు ముందు అమెరికాలో జరగలేదని, వీటిని అంతా ఖండించాల్సి ఉందన్నారు. అమెరికాలో హింసకు తావు లేదని ప్రకటించారు. ఘటన తరువాత ఆయన ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు, ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపిరో , బట్లర్ మేయర్ బాబ్ డండాయ్‌తో కూడా బైడెన్ మాట్లాడారు. ఘటనను దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ , మాజీ ప్రెసిడెంట్లు బరాక్ ఒబామా, జార్జి డబ్లు బుష్ , బిల్ క్లింటన్ ఖండించారు. ట్రంప్ తీవ్రంగా గాయపడనందుకు తాను ఊరట చెందానని, ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ విచక్షణారహిత కాల్పులతో ఆందోళన చెందుతున్న ట్రంప్ కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నట్లు, గాయపడ్డ ఇతరులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ప్రకటన వెలువరించారు. సకాలంలో సరైన విధంగా స్పందించిన సీక్రెట్ సర్వీసెస్ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. పలువురు రిపబ్లిక్, డెమోక్రాటిక్ నేతలు కూడా ఘటనను ఖండించారు.