గ్రాడ్యుయెట్లు అయి ఉంటే చాలు నేరుగా అమెరికా శాశ్వత నివాసత్వపు గ్రీన్‌కార్డు ఇస్తామని అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా కళాశాలలో గ్రాడ్యుయెట్లు అయిన విదేశీ విద్యార్థులకు ఇక్కడి గ్రీన్‌కార్డులు ఇవ్వాలనేదే తమ కీలక ప్రతిపాదన అని తెలిపారు. అమెరికా అధ్యక్ష బరిలో ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నెంబర్ ఒన్‌గా నిలిచారు. బైడెన్‌తో తలపడనున్నారు.ఈ దశలో గ్రీన్‌కార్డులు జారీ గురించి ఆయన అనూహ్య ప్రతిపాదన చేశారు. తన అధికార హయాంలో వలస విధానంపై పాటించిన పాలసీకి భిన్నంగా ఈ ప్రతిపాదన ఉంది. విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఇందుకు భిన్నంగా మాట్లాడటం విస్మయకరం అయింది.
పలు ప్రముఖ ఐటి సంస్థలు, కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడంపై ఆలోచలనలేమిటనే అంశంపై ఓ ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడారు. ఇక్కడి కాలేజీలలో చదువుకుని బయటకు రాగానే వారికి డిగ్రీ, లేదా డిప్లోమా పట్టాలతో పాటు గ్రీన్‌కార్డు కూడా అందించాలనేదే తన ఆలోచన అని, దీనితో విద్యార్థులు ప్రత్యేకించి ప్రతిభావంతులు ఇక్కడి పౌరులుగా సేవలందిస్తారని చెప్పారు. జూనియర్ కాలేజీలకూ దీనిని వర్తింపచేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గ్రాడ్యుయెట్లకు వెంటనే గ్రీన్‌కార్డులపై తొలి ప్రాధాన్యతాక్రమంలో వ్యవహరిస్తామని ప్రకటించారు. నిజానికి తన గత హయాంలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అనుకున్నానని, కానీ కరోనా ఇతర కారణాలతో చేయలేకపొయ్యానని చెప్పారు. అమెరికాలో వీసా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అంగీకరించారు.
ప్రతిభావంతులైన యువతరం భారత్ చైనా నుంచి ఇక్కడికి వచ్చినా పలు రకాల వీసా సంక్లిష్టతలతో ఇక్కడ ఉండలేక స్వదేశాలకు వెళ్లుతున్నారని, అక్కడ సంస్థలు నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ తిరుగుపయనంతో అమెరికా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలను అరికట్టి, సక్రమ రీతిలో ఇక్కడికి వచ్చే వారికి స్థిరనివాస యోగ్యత కల్పిస్తే అది వారికే కాకుండా అమెరికాకు , అమెరికన్లకు దోహదం చేసినట్లు అవుతుందన్నారు.