Sunday, December 22, 2024

శ్వేతసౌధంలోకి ట్రంప్ పునరాగమనం

- Advertisement -
- Advertisement -

కమలా హారిస్ ఓటమితో అమెరికా రాజకీయాల్లో మహిళల స్థానం ప్రశ్నార్థకంగా మారింది. హిల్లరీ క్లింటన్‌ను నిరాదరించిన తరహాలోనే కమలా హారిస్‌ను కూడా అమెరికా పౌరులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. శ్వేతసౌధంలోకి మరోమారు డోనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టబోతున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే సంవత్సరం జనవరి నెలలో పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే కేవలం ఆ దేశ ప్రజలకే కాదు ప్రపంచానికే ఎన్నికలనే అభిప్రాయం ప్రబలిపోయింది. సోవియట్ రష్యా పతనం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం సమసిపోయింది.

ద్విధ్రువ ప్రపంచం అదృశ్యమై, అమెరికా సారథ్యంలో ప్రపంచాన్ని ఒంటిచేత్తో నడిపే ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం అంతరించింది. అమెరికా, సోవియట్ రష్యాలు ప్రపంచాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. ఇరుదేశాల యుద్ధోన్మాద చర్యలకు ప్రపంచం భీతిల్లిపోయింది. ఇరుదేశాల మధ్య అర్ధ శతాబ్దం కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం ‘సోవియట్ యూనియన్’ విచ్ఛిన్నంతో అంతమైపోయింది. ఉత్థాన పతనాలు ప్రపంచ రాజకీయ చరిత్రలో కొత్తేమీ కాదు. వింతేమీ లేదు. ఎగిరిపడే కెరటాలు సైతం వెనుదిరగక తప్పదు. సునామీ సైతం సద్దుమణగక తప్పదు. అదే తరహాలో బలవంతులమని విర్రవీగే దేశాలెన్నో బలహీన దేశాల చెంత పాదాక్రాంతమైన సంఘటనలెన్నో జరిగాయి.

ఇలాంటి పరిణామాల వలన ఎన్నో సంపన్న దేశాలు పేద దేశాలుగా, పేద దేశాలు ధనిక దేశాలుగా ఆవిర్భవించాయి. అమెరికా కూడా ఎన్నో రాజకీయ, సామాజిక పరిణామాల అనంతరం అగ్రరాజ్యంగా అవతరించింది. సోవియట్ పతనం తర్వాత కూడా అమెరికా తన అగ్రరాజ్య హోదాను కాపాడుకోవడానికి ఎన్నో తంటాలు పడుతున్నది. బెదిరే దేశాలను తన పాదాక్రాంతం చేసుకుని, బెదరని దేశాలను భయపెట్టి ప్రపంచానికి పెద్దన్నగా చెలామణి అవుతున్నది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో జరిగిన ఎన్నికలు ఎంతో ఉత్కంఠతను కలిగించాలి. ప్రపంచమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఎదురుచూసింది. ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాసించే పెద్దన్న తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ భవితవ్యం ఆధారపడి ఉండడమే దీనికి కారణం. ఇప్పటి వరకు ఎన్నో పర్యాయాలు అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.

ఎంతో మంది ప్రముఖులు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అలంకరించి, అగ్రరాజ్యహోదాను నిలబెట్టారు. గతంలో నాలుగు సంవత్సరాలు అమెరికాను పాలించిన డోనాల్డ్ ట్రంప్ వలన అమెరికా ప్రతిష్ఠ మసకబారింది. అగ్రరాజ్యమనే గౌరవ భావన అడుగంటింది. ట్రంప్ చేష్టలతో ప్రపంచం బిత్తరబోయింది. మెక్సికో గోడ పేరుతో ట్రంప్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. ‘నా దేశం- నా ప్రజలు’ అనే భావన ప్రతీ దేశానికి, ప్రతీ పౌరుడికి, ప్రతీ ప్రభుత్వాధినేతకు ఉండడం సహజం. ఇది కాదనలేని సత్యం. ఇతర దేశాల విషయం ప్రక్కనబెడితే, పెద్దన్నగా ప్రపంచాన్ని శాసించాలని నిరంతరం వ్యూహాలు పన్నే అమెరికా విషయంలో ‘తన దేశం- తన ప్రజలు’ అనే సంకుచితమైన అభిప్రాయం అంకురించడం అగ్రరాజ్యాధి పత్యానికి తిలోదకాలివ్వడమే. తన పరిపాలనలో ఇదే విధానం కొనసాగించి, అమెరికా ప్రజల్లో శ్వేత జాతీయులు, నల్లజాతీయులనే భేదభావం ప్రదర్శించి జాత్యహంకార బీజాలు నాటిన ట్రంప్ వల్ల అమెరికన్లలో వ్యతిరేక ధోరణి ప్రబలింది.

పార్టీలపరంగా, జాతులపరంగా దేశాన్ని రెండుగా చీల్చడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాల వలన డెమొక్రాట్లు అధికారంలోకి రావడం జరిగింది. గత ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి దూరమైన ట్రంప్ మళ్లీ శ్వేతసౌధంలో విహరించబోతున్నారు. ట్రంప్ వలసవాదుల పట్ల, విదేశీయులకు వీసాల మంజూరులో గతంలో వ్యవహరించిన తీరుపట్ల అనేక మంది ప్రతిభావంతులు అమెరికా చదువులకు, ఉద్యోగాలకు దూరమైనారు. ఇదే వైఖరి ఇప్పుడు కూడా కొనసాగిస్తారా? లేక గత వైఖరికి భిన్నంగా వ్యవహరించి, మారిన మనిషిగా వలసవాదుల మనోభిప్రాయాలను మన్నించి, వారి గౌరవాభిమానాలకు పాత్రుడవుతారా? అనే విషయం త్వరలోనో స్పష్టమవుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఇతర దేశాలతో ఆర్ధిక, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క దేశం గిరిగీసుకుని మనుగడ సాగించలేదు. ఒక దేశానికి, మరో దేశానికి వైద్య, సాంకేతిక, ఉద్యోగపరమైన అవసరాల దృష్ట్యా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరం. ప్రస్తుత ఆర్ధిక అవసరాల రీత్యా ప్రపంచీకరణ వలన ఏ దేశమైనా ఇతర దేశాలతో సఖ్యతగా మెలగాలి. గిరిగీసుకుని ఒంటరిగా బ్రతికే రోజులు పోయాయి.

మరోమారు అమెరికా అధ్యక్షునిగా జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ ముందు అనేక సవాళ్ళులున్నాయి. ఎన్నో బాధ్యతలు, బరువులు ట్రంప్ కోసం ఎదురు చూపులు చూస్తున్నాయి. గతంలో ట్రంప్ అనుసరించిన విధానాలపై సమీక్ష జరగాలి. వలసదారులకు అన్ని దారులు మూసి వేయడానికి, అమెరికా జాతీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి గతంలో ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో తెంపరితనం ప్రదర్శించింది. హెచ్ 1బి వీసాల విషయంలో ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో విద్య, ఉద్యోగావకాశాల కోసం పోటీపడిన అనేక మంది విదేశీ ప్రతిభావంతులకు నిరుత్సాహం కలిగించాయి. వీసాల విషయంలో కూడా నిబంధనలు విధించడం వలన అమెరికావాసులకు ఎలాంటి ప్రయోజనం సిద్ధించలేదు. వీసాల మంజూరు విషయంలో అమెరికా వైఖరి వలన భారత్ టెకీలు నష్టపోయిన మాట వాస్తవం. అయితే ట్రంప్ గత పాలనకు విరుద్ధంగా పరిపాలన సాగిస్తారా? లేదా అదే విధానం కొనసాగిస్తారా? అనే సందిగ్ధం కొనసాగుతున్నది.

అమెరికా అభివృద్ధిలో విదేశీ ప్రతిభ ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో విదేశీయులను కాదని అమెరికా అభివృద్ధి సాధించలేదు. గత ట్రంప్ పాలన భారతీయుల ప్రతిభకు అణగదొక్కింది. అభివృద్ధికి శరాఘాతంలా మారింది. చైనాపై అక్కసుతో భారత్‌పట్ల ట్రంప్ సానుకూల వైఖరి ప్రదర్శించే అవకాశముంది. చైనాపై అమెరికా తన ‘ట్రేడ్ వార్’ లో భాగంగా భారత్‌కు అనుకూలంగానే ప్రవర్తించడం భారత్ పై కయ్యానికి సై అంటూ కాలు దూసే చైనా దూకుడుకు ఒక రకంగా కళ్ళెం వేయగలదు. ట్రంప్ పునరాగమనంతో భారత్ కు మేలు జరుగుతుందా? భారత దేశానికి ఇబ్బంది కలుగని రీతిలో చైనాతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం వలన భారత దేశానికి నష్టమేమీలేకపోవచ్చు. అయినా చైనాతో ట్రంప్ సఖ్యంగా మెలిగే అవకాశాలు లేవనే చెప్పాలి. ట్రంప్ తెంపరితనం ప్రపంచానికి కొత్త సమస్యలు తలెత్తవచ్చు. చైనాతో ట్రంప్‌కున్న విభేదాల కారణంగా భారత్‌కు మేలు జరిగే అవకాశాలున్నాయి. తనకు పక్కలో బల్లెంలా తయారవుతున్న చైనాను నిలువరించకపోతే అమెరికా అస్తిత్వానికే ముప్పు. ఈ విషయం అమెరికా పాలకులకు తెలియనిది కాదు. ఎవరు శ్వేతసౌధంలోకి అడుగుపెట్టినా తమ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇతర దేశాల ఎదుగుదలకు సహకరిస్తారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే కాగలదు.

పెద్దన్న పాత్రను వదులుకోవడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోదు. ఇతర దేశాల అభివృద్ధిని తట్టుకోలేదు. రిపబ్లికన్ల పాలనలోను, డెమొక్రాట్ల పాలనలోను ఇప్పటి వరకు జరిగిన తంతు ఇదే. అమెరికా రథసారథ్యం వహించిన మహామహులంతా ఇదే విషయాన్ని నిరూపించారు. భారత ఉపఖండంలో శాంతి సుస్థిరతలను కాపాడడంలో అమెరికా విదేశాంగ విధానం కీలక భూమిక పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ అపగలరా? ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య సంఘర్షణను నిలువరించగలరా? ట్రంప్ పాలనపై పలు ప్రపంచ దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉన్న దృష్ట్యా ట్రంప్ హుందాగా పాలిస్తూ ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సమసిపోయేలా చేయాలని ఆశిద్ధాం.

సుంకవల్లి సత్తిరాజు
97049 03463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News