అడుసు తొక్కనేల, కాలు కడగనేల అనే సామెత అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌కు అతికినట్లుగా సరిపోతుంది. ఎందుకంటే, అధికారపగ్గాలు చేపట్టిననాటినుంచీ ఆయన చేస్తున్న పని అదే. తాజాగా ఇరాన్ విషయంలోనూ అదే జరుగుతోంది. అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబు దాడికి సైతం వెనుకాడబోమంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధాలు సమకూర్చుకునే దిశగా ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని భారీయెత్తున చేపట్టడం అమెరికాకు, దాని మిత్రదేశం ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, ఇరాన్ ఎందుకిలా చేస్తోందని ప్రశ్నించుకుంటే అందుకు ట్రంప్ మహాశయుడే కారణమని చెప్పకతప్పదు.
\ఒకప్పుడు ఇరాన్ అణ్వాయుధాల తయారీయే లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలను భారీగా సమకూర్చుకోవడం మొదలుపెట్టింది. దాంతో, అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షల కొరడా ఝళిపించాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్ మెడలు వంచి అణు ఒప్పందానికి తల వంచేలా చేయగలిగారు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యత్వ దేశాలు, జర్మనీ, యురోపియన్ యూనియన్‌లతో ఇరాన్ 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎంతో కీలకమైనది. ఈ ఒడంబడిక మేరకు ఇరాన్ 3.67 శాతానికి మించి యురేనియాన్ని శుద్ధి చేయబోనని హామీ ఇచ్చింది. దరిమిలా, పాశ్చాత్య దేశాలు తమ ఆంక్షలను ఉపసంహరించుకోవడంతో ఇరాన్ తెరిపినపడింది. అయితే, ట్రంప్ తొలిసారి అధికారంలోకి రాగానే 2018లో ఈ ఒప్పందాన్ని కాలరాచి, ఏకపక్షంగా బయటకు వచ్చేశారు.
దీంతో ఇరాన్ మళ్లీ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇది గమనించిన ట్రంప్, ఇరాన్‌ను మళ్లీ అణు ఒప్పందానికి రమ్మంటూ ఒత్తిడి చేస్తున్నారు. మొదటిసారి కుదిరిన అణు ఒప్పందంనుంచి ఆయన వెనకాముందూ ఆలోచించకుండా బయటకు రాకపోతే, ఈ పరిస్థితి తలెత్తేది కాదు కదా. వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చాక, ఇరాన్ పై అనేక ఆంక్షలు విధించారు. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇక ఆయన రెండోసారి గెలిచాక, ఇరాన్ పతనం మరింత వేగం పుంజుకుంది. గత పదేళ్లలో ఆ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. 2015లో డాలర్‌తో మారకం విలువ 32 వేల రియాల్స్ కాగా, ప్రస్తుతం అది పది లక్షల రియాల్స్‌కు పడిపోయింది. అణు ఒప్పందంనుంచి అమెరికా తప్పుకోవడంతోపాటు పశ్చిమ దేశాలు కూడా ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించిన ఫలితమిది. ప్రపంచంలోనే అతి తక్కువ విలువ ఉన్న కరెన్సీలలో ఇప్పుడు ఇరాన్ రియాల్ మూడో స్థానంలో ఉంది. ఈ కోణంలోంచి చూస్తే, అణు ఒప్పందం కుదుర్చుకోవడం ఇరాన్‌కూ మంచిదే. కానీ, అందుకు ట్రంప్ ఎంచుకున్న మార్గమే ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే, పరోక్ష చర్చలకు సరేంటూ ఒకవైపు పచ్చజెండా ఊపినా, మరోవైపు ట్రంప్ బాంబు దాడులు చేసినా తిప్పికొట్టగలిగే విధంగా ఇరాన్ తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.
భూగర్భ క్షిపణి నగరం నిర్మాణం అందులో భాగమే. దేశవ్యాప్తంగా లాంచ్ ప్యాడ్ లపై క్షిపణులను నిలిపి, అమెరికా వైమానిక దాడులను కాచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. యురేనియం నిల్వలను సమకూర్చుకోవడంతోపాటు హుతీలకు ఇరాన్ మద్దతుగా నిలబడటం కూడా అమెరికా, ఇజ్రాయెల్‌కు కంటగింపుగా మారింది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే, దానిని దారికి తేవడం సులభం కాదన్న సంగతి ఈ మిత్ర ద్వయానికి తెలుసు కాబట్టే మరోసారి అణు ఒప్పందం పేరిట దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తమతో అణుఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబుల దాడి చేస్తామని హెచ్చరించడం ట్రంప్ తెంపరితనానికి నిదర్శనం. అగ్రరాజ్యాధిపతిగా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలబడవలసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తన దుందుడుకు చేష్టలతో కావలసినంత అప్రదిష్ట మూటగట్టుకున్నారు. పరిణతి చెందిన రాజకీయవేత్తగా, హుందాగా ప్రవర్తించవలసిన ఆయన, తన వింత పోకడలతో అమెరికా అధ్యక్ష పీఠానికే మాయని మచ్చగా పరిణమించారు. సమస్య పరిష్కారానికి సామ దాన భేద దండోపాయాలని నాలుగు మార్గాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. కానీ, ట్రంప్‌కు తెలిసింది ఒక్క దండోపాయం మాత్రమే. బెదిరించి, భయపెట్టి శత్రువులను లొంగదీసుకోవాలనుకోవడం ఎల్లవేళలా చెల్లదు. ఈ సత్యాన్ని ట్రంప్ ఎంత తొందరగా గ్రహిస్తే, అగ్రరాజ్యానికి అంత మేలు చేసినవారవుతారు.