అమెరికా చరిత్రలో నేర విచారణను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ప్రజల ముందు డోనాల్డ్ ట్రంప్ నిలబడనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ చేస్తారన్న వార్తలు కొంతకాలంగా గుప్పుమంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష పదవి రేసులో తాను ఉంటానని ఇటీవల ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అగ్రరాజ్యానికి పూర్వవైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమన్నారు ట్రంప్. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ఒప్పందం బయటపడడంతో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్ పార్టీ ఎంతవరకు అంగీకరిస్తుందనే ప్రశ్న తెర మీదకు వస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇది చిన్నాచితకా వివాదం కాదు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డోనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లేంతటి తీవ్రస్థాయి వివాదం. తనతో పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారనేది డోనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన తాజా ఆరోపణ. ఈ మేరకు తన మాజీ న్యాయవాది మైఖేల్ కొహెన్ ద్వారా స్టార్మీ డేనియల్స్‌కు 1,30,000 డాలర్లు చెల్లించారన్నది ఆరోపణ. స్టార్మీ డేనియల్స్‌కు సొమ్ములు చెల్లించిన విషయాన్ని ఇటీవల మైఖేల్ కొహెన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాల నమోదుకు మన్హటన్ గ్రాండ్ జ్యూరీ తాజాగా అనుమతించింది.
స్థూలంగా ఇదీ డోనాల్డ్ ట్రంప్‌పై నమోదైన తాజా కేసు. అయితే ఇదంతా డెమొక్రాట్ల కుట్ర అంటూ కొట్టిపడేశారు ట్రంప్. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి న్యాయ వ్యవస్థను డెమొక్రాట్లు ఉపయోగించుకుంటున్నారని ఎదురుదాడి చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఎదురుదాడి సంగతి ఎలాగున్నా ఈ వివాదం అమెరికాలో దుమారం రేపుతోంది. అమెరికా చరిత్రలో నేర విచారణను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ప్రజల ముందు డోనాల్డ్ ట్రంప్ నిలబడనున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ చేస్తారన్న వార్తలు కొంతకాలంగా గుప్పుమంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష పదవి రేసులో తాను ఉంటానని ఇటీవల ట్రంప్ కుండబద్దలు కొట్టారు. అగ్రరాజ్యానికి పూర్వవైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమన్నారు ట్రంప్. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అయితే పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ఒప్పందం బయటపడడంతో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రిపబ్లికన్ పార్టీ ఎంతవరకు అంగీకరిస్తుందనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. అయితే టెక్నికల్‌గా చూస్తే అధ్యక్ష పదవి ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయడానికి తాజా కేసు ఏమాత్రం అడ్డంకి కాబోదంటున్నారు అమెరికా రాజ్యాంగ నిపుణులు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన అమెరికా రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నది నిపుణుల అభిప్రాయం.
ట్రంప్ ప్రతిష్ఠను దెబ్బతీసిన పార్లమెంటు భవనంపై దాడి సంఘటన ఆధునిక అమెరికా చరిత్రలో డోనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు.
ఆయన జీవితంలో ప్రతి అధ్యాయంలోనూ వివాదాలు కనిపిస్తుంటాయి. 2021 జనవరి ఆరో తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి డోనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్య లు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. పార్లమెంటు భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని ఈ కమిటీ తేల్చి చెప్పింది.ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డోనాల్డ్ ట్రంపే. ఇంతటి ఘన చరిత్రను డోనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు. అయితే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా పట్టించుకునే రకం కాదు డోనాల్డ్ ట్రంప్. తాను అనుకున్నదే కరెక్ట్ అంటూ ముందుకు సాగడమే ట్రంప్ నైజం.
డోనాల్డ్ ట్రంప్ మౌలికంగా వ్యాపారవేత్త. సాదాసీదా వ్యాపారవేత్త కాదు. అమెరికా కుబేరుల జాబితాలో డోనాల్డ్ ట్రంప్ ఒకరు. అదీ ట్రంప్ మహాశయుడి రేంజ్. అయితే వ్యాపారవేత్తగా సంపాదించిన ఐశ్వర్యం, సాధించిన పేరుతో డోనాల్డ్ ట్రంప్ సంతృప్తి పడలేదు. అమెరికన్ పాలిటిక్స్‌లోనూ హల్‌చల్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయాల్లో డోనాల్డ్ ట్రంప్ జంపింగ్ జపాన్ కిందే లెక్క. కొంత కాలం రిఫార్మ్ పార్టీలోనూ, మరి కొంత కాలం డెమొక్రాటిక్ పార్టీలోనూ ట్రంప్ కొనసాగారు. చివరకు రిపబ్లికన్ పార్టీలో తేలారు. అంచెలంచెలుగా రిపబ్లికన్ పార్టీలో ఓ పెద్ద లీడర్‌గా ఎదిగారు. సాదాసీదా పదవులతో సంతృప్తిపడే రకం కాదు ట్రంప్. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనే మనస్తత్వం ఆయనది. ఎప్పటికైనా అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది ట్రంప్ మహాశయుడి చిరకాల కోరిక. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం ట్రంప్ అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012 ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా అవకాశం దక్కలేదు. అయితే డోనాల్డ్ ట్రంప్‌ది ఉడుంపట్టు. చివరకు 2016లో ట్రంప్‌కి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం దక్కింది.
ఫలించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మంత్రం మేక్ అమెరికా గ్రేట్ అగైన్… అప్పట్లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం జనంలోకి దూసుకెళ్లింది. అలాగే నేటివిటీని టార్గెట్‌గా చేసుకుని ట్రంప్ చేసిన ప్రచారం కూడా వర్క్ అవుట్ అయింది. కొన్ని తరాలుగా అమెరికాలో పుట్టి పెరిగిన భూమిపుత్రులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే, ఆసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వేలాది మంది కార్పొరేట్ రంగాల్లో బాసుల్లా మారుతున్నారంటూ ట్రంప్ చేసిన ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. భూమి పుత్రులైన అమెరికన్లను బాగా రెచ్చగొట్టింది. దీంతో నేటివ్ అమెరికన్లు డోనాల్డ్ ట్రంప్‌కు జై కొట్టారు. ఫలితంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు 45వ అధ్యక్షుడయ్యారు. డోనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు, ఆరోపణల సంగతి ఎలాగున్నా ఆయనలో మరో కోణం ఉంది. అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నంత కాలం భారత్‌కు ట్రంప్ స్నేహ హస్తం అందించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంచి మిత్రుడిగా మెలిగారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి డోనాల్డ్ ట్రంప్ అనేక చర్యలు తీసుకున్నారు.
ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320