వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రహస్య పత్రాల దాచివేత అభియోగాల కేసులో మియామీ కోర్టుకు హాజరయ్యారు. అమెరికా చరిత్రలో ఓ ప్రెసిడెంట్ ఈ విధంగా క్రిమినల్ అభియోగాలను ఎదుర్కోవడం. న్యాయస్థానానికి హాజరుకావడం ఇదే తొలిసారి. దేశ న్యాయస్థాన వేదికలపై ఇది చారిత్రక ఘట్టం అయింది. నీలం రంగు నేవీ సూట్, ఎర్రటి టై ధరించిన ట్రంప్ కోర్టుకు విచారణ ఆరంభానికి పావుగంట ముందే వచ్చారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసపు బాత్రూంల్లో దాచిపెట్టి అనేక సార్లు ఆయన చట్టాన్ని ఉల్లంఘించారని వెలువడ్డ అభియోగాలను ట్రంప్ తోసిపుచ్చారు. న్యాయమూర్తి గుడ్‌మెన్ తన స్థానానికి వచ్చే వరకూ మాజీ అధ్యక్షులు ట్రంప్ తన స్థానంలో కాళ్లు జారవిడుచుకుని, చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. జడ్జి వచ్చే వరకూ నింపాదిగా ఉన్నారు. బుధవారం (14న ) ట్రంప్ పుట్టినరోజు.
దీనికి ముందు రోజు ఆయన కోర్టుకు వచ్చారు. ట్రంప్‌పై 34 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. తాను ఏ నేరం చేయలేదని ట్రంప్ తెలిపారు. ట్రంప్ కుమారుడు ఎరిక్ తండ్రి వెంట వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి కూడా రిపబ్లికన్‌గా తాను బరిలోకి దిగుతానని చెపుతూ వస్తున్న ట్రంప్ రాజకీయ భవితను ఈ కేసు తేల్చనుంది. ట్రంప్ తీవ్ర ద్రోహానికి పాల్పడినట్లు, తన అధ్యక్ష పదవీకాలంలో తన వద్ద ఉండే రహస్య పత్రాలను తిరిగి అధికారులకు అప్పగించకుండా కీలక సమాచారాన్ని తొక్కిపెడుతున్నట్లు ప్రభుత్వ తరఫు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. మాజీ అధ్యక్షుడిపై దాఖలైన 37 అభియోగాలలో 31 వరకూ అత్యంత కీలకమైన అధికారిక పత్రాల భద్రత, గూఢచర్య చట్టాల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయి.
కీలక రహస్య పత్రాల అభియోగాలు రుజువు అయితే ట్రంప్ ఎన్నికల్లో పోటీ అనర్హతతో ఇతరత్రా పడే అవకాశం ఉంటుంది. ఈ కేసు విచారణ ఇకపై జిల్లా జడ్జి ఐల్లిన్ కన్నాన్ నిర్వహించే బెంచ్ పరిధిలో జరుగుతుంది. ఈ మహిళా జడ్జిని ట్రంప్ హయాంలో నియమించారు. ట్రంప్ కేసులో గతంలో ఆమె వెలువరించిన పలు రూలింగ్‌లు ప్రశ్నార్థకం అయ్యాయని సిఎన్‌ఎన్ తెలిపింది.