అమెరికా 47వ ప్రెసిడెంట్ గా సోమవారంనాడు డోనాల్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాషింగ్టన్ డిసిలో ఆనాడు గడ్డకట్టే చలి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రతిష్టాత్మక మైన క్యాపిటల్ రోటుండా భవనం లోపల డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ట్రంప్ అభిమానులకు నిరాశ తప్పడం లేదు. వాషింగ్టన్‌ని సందర్శించే దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని వ్యక్తిగతంగా చూడలేరు. దాదాపు 40 ఏళ్లలో తొలిసారిగా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని క్యాపిటల్ భవనం లోపల నిర్వహిస్తున్నారు.
సాధారణంగా క్యాపిటల్ భవనం మెట్ల వద్దే ఈకార్యక్రమం ఉంటుంది. దేశ విదేశీ అతిథులు హాజరయ్యే ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల కారణంగా పలు మార్పులు చేయాల్సి వస్తోంది. 1985 లో అప్పటి ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ రెండో దఫా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చలి వాతావరణం కారణంగా భవనం లోపలే నిర్వహించాల్సి వచ్చింది. క్యాపిటన్ భవనం లో జరిగే కార్యక్రమానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇతర ప్రముఖులు, అతిథులు హాజరు కానున్నారు. భవనంలో చిన్న వేదిక ఏర్పాటు చేశారు. అక్కడే ట్రంప్ ప్రమాణం చేస్తారు.
మైనస్ ఆరు డిగ్రీల ఉష్ణ్రోగ్రత…
సోమవారం ప్రమాణ స్వీకారం జరిగే సమయానికి వాతావరణం మైనస్ 6 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చునని నేషనల్ వెదర్ సర్వీసెస్ పేర్కొంది. రీగన్ రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన సమయంలో వాతావరణం మైనస్ 14 డిగ్రీల సెల్సియస్ గా ఉందని.. ఆ తర్వాత ఇంత దారుణమైన చలి ఉండడం ఇదే . చలితో పాటు చలి గాలులు వీచే అవకాశం ఉంది. 2009లో అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారం సమయంలో వాతావరణం మైనస్ 1 డిగ్రీల సెల్సియస్ ఉంది. కాగా 2020 లో జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసినప్పడు 42 డిగ్రీల ఫారన్ హీట్ అంటే 5.5 సెల్సియస్ గా వాతావరణం ఉంది.
అమెరికన్లు 64 ఏళ్లనాడు జాన్ ఎఫ్ కెనడీ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్నిగుర్తు చేసుకుంటున్నారు. 22 డిగ్రీల ఫారన్ హీట్ వాతావరణంలో అప్పుడే పడిన 8 అంగుళాల మంచును సిబ్బంది తొలగించారు. అప్పుడు కెనడీ క్యాపిటల్ భవనం మెట్లపై నిలిచి ప్రెసిడెంట్ గా తొలి ప్రసంగం చేశారు. అదీ టాప్ కోట్ తీసివేసి నిలబడి కెనడీ తన ప్రసంగం చేయడం విశేషం. 120 ఏళ్ల క్రితం 1009 లో విలియమ్ హోవార్డ్ పది అంగుళాల మందం స్నో పడుతుంటే.. భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో మార్చ్ 4న అధ్యక్షుడి పమాణస్వీకార కార్యక్రమం జరిగేది.