అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎపుడు ఏ వైఖరి తీసుకునేదీ తెలియని చంచలచిత్తుడనే పేరుండటం తెలిసిందే. ఆ మాట ఇక్కడ మనం అనుకోవటం కాదు. ఆయన గత పర్యాయం (2017 20) అధ్యక్షునిగా ఉన్నకాలం నుండి అమెరికా, యూరప్‌లలో ఏర్పడిన ఈ అభిప్రాయం తక్కిన ప్రపంచానికి వ్యాపించింది. ఈసారి అధ్యక్షుడైన తర్వాత మరింత ప్రకోపించింది. ప్రస్తుతం ప్రపంచాన్నంతా కుదిపివేస్తున్న దిగుమతి సుంకాల హెచ్చింపు విషయాన్నే చూడండి. ఏప్రిల్ 2న ఈ ప్రకటన చేసిన ట్రంప్ 9వ తేదీన అమలుకు తెచ్చి, కొద్ది గంటలు గడిచే సరికి అకస్మాత్తుగా వాటి అమలును 90 రోజులు వాయిదా వేసారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తర్వాత రెండు వారాలు గడిచేసరికి ఇపుడు అంతే ఆశ్చర్యకరంగా మరొక పని చేయనున్న సూచనలు కనిపిస్తున్నాయి.
సుంకాల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది చైనాతో కావటం తెలిసిందే. మూడు విడతలలో వాటి స్థాయి 245 శాతానికి చేరింది. అందుకు ప్రతిగా చైనా 125 శాతం వరకు పెంచి, ఈ లెక్కలకు ఇక అర్థం లేదని ఇదొక ప్రహసనంగా మారింది. గనుక ఇంతటితో ఆపి వేస్తున్నామని, అయితే చివరి వరకు పోరాడుతాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. విశేషం ఏమంటే, తన సుంకాలను 245 శాతానికి పెంచటమే గాక, ఇతర దేశాలకు వలె 90 రోజుల పాటు చైనాపై మాత్రం వాయిదా వేయని ట్రంప్, ఆ స్థాయిలో సుంకాలు అవాస్తవికమని, ఆ మేరకు కొనసాగించటం సాధ్యం కాదని ఈ నెల 22న తనంతట తానుగా ప్రకటించారు. ఆ విధంగా ప్రపంచాన్ని మరొక మారు ఆశ్చర్యపరిచారు. ట్రంప్ వెనుకడుగు సూచన అనుకోవటం అందువల్లనే. అయితే తన సూచన మేరకు ఆయన రాగల రోజులలో ఏమి చేయగలరన్నది చూడవలసిన విషయం.
ఇంతకూ జరిగిందేమిటి? అమెరికా అధ్యక్షుడు 22న వైట్ హౌస్‌లో జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ, “చైనా సరకులపై సుంకాలు గణనీయంగా తగుతాయి. కాని సున్నా శాతానికి మాత్రం చేరవు” అన్నారు. “145 శాతం చాలా ఎక్కువ. ఆ స్థాయిలో ఉండవు” అని కూడా సూచించారు.
ఇందులో గమనించదగ్గవి రెండున్నాయి. వాస్తవానికి ఆయన సుంకాలను చివరిగా 245 శాతానికి పెంచారు. ఇపుడు 245 శాతం ప్రసక్తి అసలు లేదు. 145 శాతం కూడా ఎక్కువంటున్నారు. అక్కడి నుంచి “గణనీయంగా” తగ్గుతాయంటున్నారు. సున్నా మాత్రం కావని చెప్తున్నారు.
దీని నుంచి తోచేదేమిటి? 245 మరపున పడింది. 145 కన్నా గణనీయమైన తగ్గుదల ఉంటుంది. సున్నా అనే ప్రస్తావన రావడమంటే తగ్గుదల గణనీయత ఏ దిశలో ఉండగలదనే దానికి పరోక్ష సూచన అన్నమాట. మొత్తం మీద అదేదో జరిగినపుడు గాని మనకు తెలియదు. పోతే, అమెరికన్ మీడియా చెప్తున్నదాని ప్రకారం, ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ తమ అధ్యక్షుని కన్నా ముందు అదే రోజు ఉదయం అదే విధమైన సూచన చేసారు. అమెరికా చైనా వాణిజ్యం భారీ సుంకాల కారణంగా దాదాపు నిలిచిపోయిందన్నారాయన. ఆయన ఆ మాట అన్నది జెపి మోర్గాన్ ఛేజ్ ఆధ్వర్యాన జరిగిన ప్రైవేట్ పెట్టుబడి సంస్థల సమావేశంలో చైనాతో వాణిజ్య యుద్ధం కొనసాగించటం సాధ్యం కాదని, అది త్వరలోనే ముగిసిపోగలదని భావిస్తున్నానని అన్నారాయన. చైనాతో తెగతెంపులు కాకుండా ఒక సమతులనాన్ని సాధించటం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకు చైనా అదే రోజున స్పందిస్తూ, బెదిరింపులు ఎంతమాత్రం పని చేయబోవని స్పష్టం చేసింది.
విశేషం ఏమంటే, యుద్ధం ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. ఇరువురూ యుద్ధ భేరీలు భీకరంగా మోగించి తొలి బాణాలు మాత్రం ప్రయోగించుకున్నారు. ఈ యుద్ధ ప్రకటన ప్రపంచ దేశాలన్నిటి పైన జరిగినప్పటికీ అసలు లక్షం చైనా అనేది అందరికీ అర్థమైంది. అందుకు ఒక కారణం ఆర్థిక స్పర్ధ కాగా, రెండవది రాజకీయ ఆధిపత్యం. ఈ రెండూ అమెరికాకు పూర్తి కీలకమైనవి. అటువంటి స్థితి లో ట్రంప్ ఇంతలోనే రాజీ ధోరణి చూపటం విస్మయకరమైనదే. ఇరువురి యుద్ధం క్రమంగా తీవ్రరూపం తీసుకోగలదని, ఇరువురితో పాటు ప్రపంచానికంతా నష్టం కలిగించగలదని, చివరకు విజేతలంటూ ఎవరూ ఉండబోరని ఆర్థికవేత్తలు అంచనా వేస్తూవచ్చారు. నిజానికి వాణిజ్య యుద్ధాన్ని తట్టుకోగల శక్తి దీర్ఘకాలంలో అమెరికా కన్న చైనాకు ఎక్కువని భావిస్తున్న నిపుణులు ఎక్కువ.
వారంతా పాశ్చాత్య దేశాలవారే. అందుకే, పట్టుదలకు పోకుండా రాజీమార్గానికి రావాలని వారు ట్రంప్‌కు సలహా ఇస్తున్నారు. ఇతరత్రా గమనించినా ఈ కొద్ది వారాలలో చైనా కన్న అమెరికా, దాని మిత్ర దేశాలు ఎక్కువ నష్టపోయాయి. సరుకుల లభ్యత, ధరల పెరుగుదల, స్టాక్స్ పతనం, డాలర్ విలువకు నష్టం, పెట్టుబడుల రంగంలో అయోమయం, బ్యాంకింగ్ వ్యవస్థల కల్లోలం వంటివన్నీ సమస్యలుగా మారసాగాయి. డాలర్ బాండ్ల విలువ తగ్గి వాటిపై నమ్మకం తగ్గి, అమ్మకాలు పెరగటమనే విచిత్రమనే పరిస్థితి కూడా మొదలైంది. ట్రంప్‌కు ఇది అన్నింటికి మించిన కలవరపాటు కలిగించినట్లు వారం రోజులనుంచే వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఆయనకు కూడా బిలియన్లు విలువ చేసే బాండ్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.
మరొక వైపు పెట్టుబడులు బయటినుంచి అమెరికాకు రాగల సూచనలు లేకపోగా, అమెరికన్ పెట్టుబడులే యూరప్‌కు, ఆసియా దేశాలకు తరలిపోవటం మొదలైనట్లు లెక్కలు చెప్తున్నాయి. ట్రంప్ అనిశ్చిత విధానాలపై అపనమ్మకం ఇందుకు కారణమన్నది ప్రధానంగా వినవస్తున్నమాట. మిగిలిన విషయాలు ఎట్లున్నా బాండ్లు దెబ్బ తినటం మొదలవుతుందని, అది మాత్రమే ట్రంప్‌పై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుందని, రాక్ ఫెల్లర్ సంస్థ నాయకత్వంలో గల భారతీయ మూలాలు గల ఆర్థిక మేధావి రుచిర్ శర్మ కొన్ని వారాల క్రితమే జోస్యం చెప్పారు. ఇపుడదే జరుగుతున్నది. అయినప్పటికీ తాను ధైర్యం కోల్పోవటం లేదని చెప్పేందుకా అన్నట్లు, తన సూచన ప్రకారం వడ్డీ రేట్లను తగ్గించేందుకు నిరాకరిస్తున్న ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు పోవెల్‌ను పదవి నుంచి తొలగించేందుకు ట్రంప్ ప్రయత్నించటంతో ఆర్థిక రంగం మరిన్ని కుదుపులకు గురికాసాగింది. దానితో ఆ విషయమై ట్రంప్ రెండు రోజుల క్రితం వెనుకకు తగ్గక తప్పలేదు. కొత్త టారిఫ్‌లు చట్ట విరుద్ధమంటూ పన్నెండు రాష్ట్రాలు కోర్టుకు వెళ్లటం మరొక ఎదురు దెబ్బగా మారింది.
దీనంతటి మధ్య ముఖ్యమైన పరిణామం మరొకటి కనిపిస్తున్నది. సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించటంతో వివిధ దేశాలు పరుగున వచ్చి తమతో చర్చలు ప్రారంభించగలవని అమెరికా అధ్యక్షుడు భావించారు. అట్లా 70 దేశాలు సంప్రదించినట్లు 12వ తేదీ కల్లా స్వయంగా ప్రకటించారు. 90 రోజులలో 90 ఒప్పందాలు జరుగుతాయన్నారు. కొత్త సుంకాలకు చిన్న దేశాలు అనేకం భయపడిన మాట నిజమే. కాని 12 నుండి ఇప్పటికి 12 రోజులు గడిచినా కనీసం ఒక్క ఒప్పందమైనా జరగకపోవటం గమనించదగ్గది. పెద్ద దేశాలలో జపాన్ నుంచి స్వయంగా ప్రధానమంత్రి చర్చల కోసం అమెరికా వెళ్ళారు. కానీ ఏమీ తేలలేదు. అమెరికా షరతులు తమకు ఆమోదయోగ్యం కాదన్నారాయన. జపాన్‌తో పాటు ఇండియా వంటి దేశాల చర్చలలో అమెరికన్ ధాన్యం ఉత్పత్తులకు మార్కెట్లలో పూర్తి అవకాశం ఉండాలనే షరతును ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్నది. లోగడ గాట్ చర్చలు, డబ్లుటిఒ చర్చల సందర్భంలోనూ ఈ ప్రతిపాదన రాగా, ఆ చర్య వల్ల భారత వ్యవసాయరంగం బాగా దెబ్బతినగల దంటూ అప్పటి ప్రభుత్వాలు తిరస్కరించాయి. ఇండియా, చైనా తదితర వ్యవసాయ ప్రధాన దేశాలు కలసికట్టుగా నిలబడ్డాయి. ఇపుడు కూడా వారి మధ్య తెరవెనుక సంప్రదింపులు జరుగుతున్నాయేమో తెలియదు. మొత్తానికి జపాన్‌తో ఒప్పందంపై అనిశ్చితి ఏర్పడటం, ఇండియా చర్చలు ధపదఫాలుగా కొనసాగుతుండటం, కెనడా, యూరప్‌లు తమ పట్టు వీడకపోవటం వంటివి అమెరికా అధ్యక్షుడిని పునరాలోచనలో పడవేసి ఉంటాయి.
ఈలోగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పలురకాలు నష్టాలకు గురవుతున్నది. చైనా తన సుంకాలనైతే 125 శాతం తర్వాత పెంచలేదు గాని, రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక చర్య తీసుకుంటూ అనేక నష్టాలు కలగజేస్తున్నది. ఇది ఇట్లాగే కొనసాగితే అమెరికా మార్కెట్లలో సరకుల కొరత తీవ్రమై, ధరలు పెరగటం ఒకవైపు, చైనా నుంచి ముడిసరకులు, యంత్ర పరికరాలు రానందున ఆ సమస్యలు మరొకవైపు, రాగల రోజులలో ఇంకా ఏ ఇబ్బందులు సృష్టించగలరోనన్న అనుమానాలు ఇంకొక వైపు ట్రంప్‌ను, అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయటం ఈ తొలి వారాలలోనే మొదలైంది. పైన పేర్కొన్న ఇతర సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇదంతా ఆయన బృందం మొదట అంచనా వేయలేకపోవటం ఆశ్చర్యకరం. ఈ పరిస్థితులన్నింటి మధ్య ట్రంప్ వెనుకడుగు వేయక తప్పటం లేదనుకోవాలి. అది ఏ మేరకన్నది వేచి చూడవలసిన విషయం. దీనినిట్లుంచితే, సుంకాల ఆయుధంతో ఆరంభించి ఆఖరున ఏదో బ్రహ్మాస్త్ర ప్రయోగంతో అసలు చైనా సవాలునే తుద ముట్టించాలన్న ఆయన కోరిక ఏమవుతుందన్న వేరే ప్రశ్న. టంకశాల అశోక్ దూరదృష్టి