Saturday, November 23, 2024

ఫేస్‌బుక్, యూట్యూబ్ లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్ ప్రముఖ సోషల్ మీడియాల్లోకి పునరాగమనం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ఆయన సోషల్ మీడియా ఖాతాలపై విధించిన నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ‘ ఐయామ్ బ్యాక్ ’ అంటూ ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలపై శుక్రవారం అభిమానులను పలకరించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌నకు ఫేస్‌బుక్‌లో దాదాపు 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో సైతం 2.6 మిలియన్ సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ఆయన అనుచరుల దాడి అనంతరం 2021లో ఆయన ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ , ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లిన వెంటనే ఆయన ఖాతాపై ఉన్న నిషేధాన్ని గతేడాది నవంబర్ లోనే ఎత్తివేశారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలపై ఈ ఏడాది జనవరి లో నిషేధం తొలగించగా, యూట్యూబ్ ఖాతా మాత్రం శుక్రవారమే అందుబాటు లోకి వచ్చింది. ఈ క్రమం లోనే ఐయాబ్ బ్యాక్ అంటూ ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో శుక్రవారం ట్రంప్ దర్శనమిచ్చారు. 2016 ఎన్నికల విజయోత్సవ సభ ప్రసంగాన్ని అందులో ఉంచారు. ‘ఇన్నాళ్లు మిమ్మల్ని వేచి ఉంచినందుకు క్షమించండి ’అంటూ ఓ కామెంట్‌ను జత చేశారు. సోషల్ మీడియా లోకి రీఎంట్రీ వెనుక 2024 ఎన్నికలే లక్షమని అందులో చెప్పకనే చెప్పారు. మరోవైపు నెలల క్రితమే ట్విటర్ ఖాతా అందుబాటు లోకి వచ్చినప్పటికీ ట్రంప్ ఇప్పటివరకు అందులో ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. ట్విటర్‌లో ఆయనకు 87 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఒక్క ట్వీటూ చేయలేదని తెలుస్తోంది. ట్విటర్‌కు పోటీగా ఇప్పటికే ఆయన ‘ట్రూత్ సోషల్’ పేరిట సొంతంగా ఓ ప్లాట్‌ఫాంను నెలకొల్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News