Monday, January 20, 2025

వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ

- Advertisement -
- Advertisement -

ఏపీ సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దంపతులు
వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్
ఎన్‌ఆర్‌ఐ గుత్తికొండ శ్రీనివాస్ రూ.1 కోటి విరాళం
సీఎం చంద్రబాబుకు చెక్కు అందించిన ఎన్‌ఆర్‌ఐ గుత్తికొండ శ్రీనివాస్
వరద సహాయక చర్యల కోసం తెలంగాణ గవర్నర్ రూ.30 లక్షల విరాళం

మన తెలంగాణ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఏపీలో వరద పరిస్థితుల పట్ల ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏపీ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి రూ.1 కోటి విరాళం అందిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను మానిటరింగ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సమీక్షలో రాష్ట్ర హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబుకు కోటి రూపాయల చెక్ అందించిన వేమిరెడ్డి దంపతులు: ఏపీలో వరద బీభత్సం పట్ల టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చలించిపోయారు. ఈ క్రమంలో ఆయన వరద బాధితులకు సాయం చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతితో కలిసి విజయవాడలో సీఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘనవిజయం సాధించగా ఆయన భార్య ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.

వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించారు. అయితే ఆ సాయం ఏ రూపంలో, ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విజయవాడలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ తప్పిదం వల్లే వరదలు వచ్చాయని, కానీ నిందను తమపై వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్‌ఆర్‌ఐ గుత్తికొండ శ్రీనివాస్ రూ.1 కోటి విరాళం: రాష్ట్రంలో భారీ ఎత్తను సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి ఎన్‌ఆర్‌ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురి చేశాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు విరాళం అందించానని శ్రీనివాస్ అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు శ్రీనివాస్ ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయాభివృద్ధికి రూ.18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు అన్నారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు శ్రీనివాస్ ను సీఎం అభినందించారు.

తెలంగాణ గవర్నర్ రూ.30 లక్షల విరాళం: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహాయక చర్యల కోసం రూ.30 లక్షల విరాళం ఇచ్చారు. తన నిధుల్లో నుంచి ముప్పై లక్షల రూపాయలను రెడ్ క్రాస్ సొసైటికి ఇచ్చారు. తక్షణ వరద సహాయం అందించాలని ఆయన రెడ్ క్రాస్ సొసైటీకి సూచించారు. అదే సమయంలో భారీగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్జీవోలు ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. భయాందోళన అవసరం లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ అభినందనలు: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన ఈ విరాళాన్ని అందచేయనున్నారు. వరద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించిన తారక్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విరాళం అందించిన మరో హీరో విశ్వక్ సేన్‌కు కూడా సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News