పార్టీల విరాళాలపై కొవిడ్ ఎఫెక్ట్
41 శాతం తగ్గిన చందాలు
కార్పొరేట్ల నుంచి ఎక్కువగా బిజెపికే
ఈ పార్టీకి అందిన మొత్తం రూ.477 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీల ఆదాయవనరులను కూడా కరోనా దెబ్బతీసింది. వివిధ రాజకీయ పార్టీలకు 2020-21లో అందిన విరాళాల గణాంకాలతో ఈ విషయం స్పష్టం అయింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో పార్టీలకు వివిధ రూపాలలో వచ్చిన విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గాయి. ఇది గత ఆర్థిక సంవత్సరపు విరాళాలతో పోలిస్తే 41.49 శాతం తక్కువ అని నిర్థారణ అయింది. 2020 మార్చి చివరిలో దేశంలో కొవిడ్ తొలివేవ్ నమోదైంది. ఆర్థిక సంవత్సరం ఆరంభానికి కొద్దిగా ముందు తలెత్తిన వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా సుదీర్ఘకాల లాక్‌డౌన్ నెలకొంది. ఈ దశలోనే పార్టీల విరాళాల మొత్తాలు గణనీయంగా పడిపొయ్యాయని వెల్లడైంది. ఎన్నికల సంస్కరణల ప్రచారవేదిక అయిన ఎడిఆర్ గురువారం ఈ వివరాలను తెలిపింది. అధికారంలో ఉన్న బిజెపికి ఈ కాలంలోనూ 477.54 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతకు ముందటి ఏడాది ఈ విరాళాల మొత్తం రూ.785.77కోట్లుగా ఉంది. ఈ విధంగా బిజెపి విరాళాల ఖాతాలో 39.23 శాతం కోత పడింది. కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ నుంచి బిజెపికి రూ 416.794 కోట్లకు పైగా అందాయి. వ్యక్తుల నుంచి బిజపికి అందిన మొత్తం రూ 60 కోట్ల వరకూ ఉంది.
ఇక కాంగ్రెస్‌కు కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ నుంచి అందిన విరాళాల మొత్తం ఈ ఏడాది రూ 35 కోట్లకు పైగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి అందిన మొత్తం రూ 38 కోట్లకు పైగా ఉందని వెల్లడైంది. జాతీయ పార్టీలకు విరాళాలు ఎక్కువగా ఢిల్లీ నుంచి ఎక్కువగా రూ 246 కోట్లు దక్కాయి. తరువాతి క్రమంలో మహారాష్ట్ర నుంచి దాదాపు రూ.72 కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్లు విరాళాలు లభించినట్లు ఎడిఆర్ తెలిపింది. గుర్తింపు పొందిన ఎనిమిది జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్, బిఎస్‌పి, సిపిఐ, సిపిఎం, టిఎంసి, ఎన్‌సిపి, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)లు అందుకున్న విరాళాల లెక్కలను ఎడిఆర్ ఆయాపార్టీలు తమ అధికారిక రికార్డుల చిట్టాలలో పొందుపర్చి ఉండగా వీటిని సేకరించింది. అయితే వివిధ పార్టీలు దాదాపుగా రూ 38 కోట్ల మేరకు చందాల లెక్కలను సరిగ్గా చూపలేదు.
Donations to National Parties fell 41.49% in 2020-21