Sunday, November 3, 2024

పార్టీల విరాళాలు తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం పై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. రాజకీయ పార్టీలకు స్వచ్ఛమైన ధనం విరాళంగా అందించాలనే ఉద్దేశం తోనే ఈ పథకం తీసుకొచ్చామని తెలిపింది. అయితే ఆ విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని పేర్కొంది. ఈమేరకు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీం కోర్టుకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్ 31న సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యం లోనే తాజాగా కేంద్రం తన లిఖిత పూర్వక వాదనలను కోర్టుకు సమర్పించింది.“ఈ పథకంతో విరాళాలు ఇచ్చేవారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. స్వచ్ఛమైన మార్గాల్లో డబ్బును సమకూర్చుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

పన్ను బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేర్చేలా చేస్తుంది. అందువల్ల ఎలాంటి నిబంధనలు, హక్కులను ఈ పథకం ఉల్లంఘించలేదు. ” అని అటార్నీ జనరల్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారం … అభ్యర్థుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అయితే … ప్రతీదీ తెలుసుకునే హక్కు వారికి లేదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండదని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సహ చట్టం ద్వారా తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని వెల్లడించారు. కేంద్రం లోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమలు లోకి తెచ్చింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ నేపథ్యం లోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

నిధుల సేకరణ కుట్ర పూరితంగానేనా ? : చిదంబరం వ్యాఖ్య
అయితే కేంద్రం వాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం విమర్శలు గుప్పించారు. ఎన్నికల బాండ్ల కేసు సందర్భంగా బీజేపీ తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. బడా కార్పొరేట్ల నుంచి బీజేపీ రహస్యంగా కుట్రపూరితంగా విరాళాలను సేకరిస్తోందని ఇప్పుడు స్పష్టమైంది. చిన్నచిన్న దాతల నుంచి డిజిటల్ లావాదేవీలతో పారదర్శకంగా విరాళాలు సేకరించే పార్టీనే (కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్‌ను ఉద్దేశిస్తూ) బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం. వచ్చే ఎన్నికల్లో ఈ బడా కార్పొరేట్లు గెలుస్తారా ? లేదా రాజకీయ పార్టీలకు సహకరించే సామాన్య పౌరులు గెలుస్తారా ? చూద్దాం ” అని చిదంబరం దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News