రాయికల్: బిజెపి అంటూ ఓట్ల కోసం వస్తున్న వాళ్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని జగిత్యాల జెడ్పి చైర్‌పర్శన్ దావ వసంత సురేష్ కోరారు. రాయికల్ లక్ష్మి గార్డెన్‌లో రాయికల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల పదవి ప్రమాణ స్వీకా రోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్‌లతో జెడ్పి చైర్‌పర్శన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పేదల పొట్ట కొట్టుతూ పెద్దలకు దోచి పెడుతుందన్నారు. వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. అనేక ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలేంటని ప్రశ్నించారు. జగిత్యాల కాంగ్రెస్ పెద్దలు జీవన్‌రెడ్డి మంత్రిగా ఉండి రోడ్లు వేయలేదని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కృషి వల్ల నేడు గల్లీ, గల్లీకి రోడ్లు వేసుకుంటున్నామని తెలిపారు.
అభివృద్ది, సంక్షేమం తమ ప్రభుత్వ లక్షమన్నారు. నిరంతరం అభివృద్ది కోసం తపించే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సేవలు మనకు అవసరమని రానున్న ఎన్నికల్లో ఎక్కువ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంటింటికి బిజెపి అంటూ ప్రజల వద్దకు వస్తున్న బిజెపి ప్రజలకు చేసిన అభివృద్ది ఎంటో నిలిదీయాలని ప్రజలను కోరారు. తమది రైతు ప్రభుత్వమని ఎక్కడ లేని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
పదవి ప్రమాణం చేస్తున్న పాలక వర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌దేన్నారు. ఫలితంగా మహిళలు రాజకీయంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు.
మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వలే పని చేస్తూ రైతుల సమస్యలను తీర్చాలన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో రోజుకో గొడవ జరుగుతుందన్నారు. పదవుల కోసం కొట్లాడుకునే ఈ పార్టీలు ప్రజలకు ఏం మేలు చేస్తాయని ప్రశ్నించారు. ఒకప్పుడు ధర్మపురి మార్కెట్ యార్డు ఉండగా రాయికల్ ఉపమార్కెట్‌గా పని చేస్తుండేదని చెప్పారు. ధర్మపురి పాలకవర్గంలో రాయికల్ మండలానికి ఒక్క డైరెక్టర్ పదవి దక్కేదని చెప్పారు.
సిఎం కెసిఆర్ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కావడంతోనే రాయికల్‌కు స్వంత మార్కెట్ యార్డు ఏర్పాటు చేసారని ఫలితంగా పాలకవర్గం రైతులకు మేలు చేసే ఫలితం దక్కిందన్నారు. రాయికల్‌ను మున్సిపల్‌గా మార్చి అభివృద్ది చేస్తున్నామని గుర్తు చేసారు. మాది చేతల ప్రభుత్వమని పేదల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్న ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఆవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, ఎంపిపి సంధ్యారాణి, జెడ్పిటిసి సభ్యురాలు జాదవ్ ఆశ్విని, మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్‌పర్శన్ గండ్ర రమాదేవి, పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఇంతియాజ్, సింగిల్‌విండో చైర్మన్‌లు ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, మార్కెట్ కమిటీ చైర్‌పర్శన్ మారంపెల్లి రాణి, తదితరులు పాల్గొన్నారు.