హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే కాంగ్రెస్, బిజెపి పార్టీలను నమ్మవద్దని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ట్విట్టర్ వేదికగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలపై ఆమె విరుచుకుపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే వంటగ్యాస్, 100 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేయనున్నట్లు ఇచ్చిన హామీ మోసపూరితమైనదని అభివర్ణించారు.
రాజస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకొని, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాల్సి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లోని బిజెపి, తెలంగాణలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వాలు పేద,మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వాలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్,బిజెపిలు మోసపూరిత హామీలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ పార్టీలు ఇచ్చే మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారని గుర్తు చేశారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం వెనుకబాటుతనం తొలగించడంలో కాంగ్రెస్, బిజెపి,బిఆర్‌ఎస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అధికారమిస్తే నాలుగు రాష్ట్రాల్లో ఆశించినస్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలను విస్మరించి,ద్రోహం చేసే పార్టీలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.