మనతెలంగాణ/హైదరాబాద్ : నిమ్స్ ఆసపత్రిపై కొందరు ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అవగాహన లేకుండా మాట్లాడేవారిని పట్టించుకుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి నిమ్స్‌పై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో దేశంలోనే తొలిసారిగా నిమ్స్ ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని,చెడు చూడొద్దు అని అంటారని, అయితే కొందరు మంచి చూడొద్దు, మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అభివృద్ధి వారికి ఏనాడు కనిపించదని, జరిగిన అభివృద్ధిపై ఒక్క ప్రశంస చేయరని విమర్శించారు. వైద్యుల సేవలను ప్రశంసించకుండా అభాండాలు వేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కొన్ని సార్లు మాట్లాడుతున్నారు. హాఫ్ నాలెడ్జ్‌తో కొందరు కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు కమిట్‌మెంట్ లేకుంటే ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోబో ఎక్విపెంట్ తెస్తామని పేర్కొన్నారు. అధునాతన రోబోటిక్ సర్జరీ విధానంలో కోత తక్కువ కాబట్టి రోగి త్వరగా కోలుకుంటారని, పేషంట్లు ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుందని వివరించారు. ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్‌కు పేదల పట్ల ఎంతో కమిట్మెంట్ ఉంది… కన్సర్న్ ఉందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు పెరిగాయని అన్నారు. తెలంగాణ రాకముందు నిమ్స్ అభివృద్ధిపై 50 ఏండ్లుగా పాలకులు ఎలాంటి శ్రద్ధ చూపలేదని విమర్శించారు. వచ్చే 10 రోజుల్లో నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. రూ.1,571 కోట్లతో 2 వేల పకడల సామర్థంతో కొత్త బ్లాక్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన 32 ఎకరాలభూమిని ప్రభుత్వం నిమ్స్‌కు కేటాయించిందని చెప్పారు. ఆసుపత్రి భవనం 14 అంతస్థులతో, 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒపి పేషెంట్‌లకు, ఇన్ పేషెంట్‌లకు, ఎమర్జెన్సీ పేషెంట్‌లకు ప్రత్యేక బ్లాక్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. 2 వేల పడకలలలో అన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 500 పడకలు ఐసీయూ కోసం, 300 పడకలు పేయింగ్ రూమ్ కోసం, అలాగే 38 ఆపరేషన్ థియేటర్‌లు, డయాలిసిస్, కాత్ ల్యాబ్, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.14 స్పెషాలిటీ, 23 సూపర్ స్పెషాలిటీ విభాగాలలో వైద్యవిద్యను అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య విద్యతో పాటుగా స్పెషాలిటీ నర్సింగ్, స్పెషలిటీ అలైడ్ హెల్త్ (పారామెడికల్) విద్య కూడా అందిస్తున్నట్లు వివరించారు.
కార్పోరేట్ ఆసుపత్రులతో నిమ్స్ పోటీ
కార్పొరేట్ ఆసుపత్రిలతో నిమ్స్ ఆసుపత్రి పోటీ పడుతున్నదని వ్యాఖ్యానించారు. 900 పడకల నుండి 1800 పడకలు పెంచామని చెప్పారు. సిఎం కెసిఆర్ 4 వేల పడకల నిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.నిమ్స్ 4 వేల పడకలతో దేశంలోనే పెద్ద ఆసుపత్రిగా రికార్డు నెలకొల్పబోతున్నదని చెప్పారు. భారత అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిమ్స్‌లో ఉందని అన్నారు. ఆలిండియా టాప్ ర్యాంకర్స్ నిమ్స్‌లో చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఫాకల్టీ సంఖ్య 111 నుండి 264కు, వైద్య విద్యార్థుల సంఖ్య సంవత్సరానికి 82 నుండి 169 పెంచామని వివరించారు. నిమ్స్‌లో సేవలు గణనీయంగా పెరిగాయని, సంవత్సరానికి ఓపీ 5 లక్షల నుండి 6 లక్షలకు, ఇన్ పేషెంట్‌ల సంఖ్య 26 వేల నుండి 50 వేలకు, సర్జరీలు 12 వేల నుండి 25 వేలకు, డయాలసిస్ సేవలు 12 వేల నుండి 72 వేలకు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు 25 నుండి 150కు పెరిగాయన్నారు. నిమ్స్ ఏర్పడ్డప్పటి నుండి తెలంగాణ వచ్చేంతవరకు అంటే 1989 నుండి 2014 వరకు 25 ఏండ్లలో చేసిన కిడ్నీ మార్పిడి సర్జరీలు 661 అయితే తెలంగాణ ఏర్పడ్డ తరవాత నుండి ఇప్పటివరకు 9 ఏండ్లలో చేసిన సర్జరీలు 753 అని, అలాగే మూలుగు మార్పిడి సర్జరీలు 46 అయితే తొమ్మిదేళ్లలో 154 సర్జరీలు జరిగాయని, మోకాలు మార్పిడి సర్జరీలు 134 అయితే 9 ఏండ్లలో 1,444 సర్జరీలు జరిగినట్లు పేర్కొన్నారు. కొత్త ఎక్విమెంట్ కొనుగోలు కోసం సిఎం కెసిఆర్ రూ.154 కోట్లు గ్రాంట్‌గా ఇచ్చారని, అరోగ్య శ్రీ నుండి వచ్చే నిధులు ఇవ్వాలని చెప్పారని హరీశ్‌రావు తెలిపారు.
నేను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియాకు రాలేదు : గవర్నర్ తమిళిసై
ఉస్మానియా ఆసుపత్రిలో భారీగా పెరిగిన రోగులతో కిక్కిరిసి, ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి నెలకొందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆసుపత్రిలో ఒక్కో బెడ్ మీద ఇద్దరు, ముగ్గురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సోమవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్, కొత్త భవంతి నిర్మాణానికి న్యాయపరమైన సమస్యలు ఉంటే.. ప్రత్యామ్నాయ పరిస్థితులు చూసి కొత్త భవనం కట్టాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితులను చూసి గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత భవన పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పాత భవంతిలో రోగులు లేరని వైద్యులు గవర్నర్‌కు చెప్పారు. పెరిగిన రోగులకు బెడ్స్ ఏర్పాటుపై గవర్నర్ ఆరా తీశారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో ఒక్కో బెడ్ మీద ఇద్దరు నుంచి ముగ్గురిని ఉంచి సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని టాయిలెట్లకు సరైన తలుపులు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే సిబ్బంది కూర్చోవడానికి సరైన ప్రదేశం లేదని తెలిపారు. సరైన స్థలం లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియాకు కొత్తగా 3000 పడకలు అవసరమని సూచించారు. తాను ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించానని, ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడుతున్నారని తెలిపారు. ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును గవర్నర్ అభినందించారు. రోజుకు 2 వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని, రోజూ 200 వరకూ సర్జరీలు జరుగుతున్నాయని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం కట్టి వందల ఏళ్లవుతోందని, ఆసుపత్రి కోసం కొత్త భవనం కట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయని, ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు చెప్పారని అన్నారు.తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదని స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్నారని తెలిపారు. –
పర్యటనలో రాజకీయ ఉద్యేశం లేదు
ఉస్మానియా ఆసుపత్రి పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. రోగులకు మంచి జరగాలనేదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం లీగల్ ఇష్యూ అని చెప్పి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. త్వరగా భవనం కట్టాలనడం రాజకీయం అవుతుందా అని ప్రశ్నించారు. రాజకీయ నేతలా మాట్లాడుతున్నానని అనడం సరికాదన్నారు. తనకు సమస్యల గురించి చెప్పే హక్కు లేదా అని ప్రశ్నించారు. తనను ప్రశ్నించడానికి బదులుగా సమస్యకు పరిష్కారం చూపితే బాగుంటుందని హితవు పలికారు.
నిమ్స్ పై నిందలేయొద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -