Thursday, January 23, 2025

మా అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దు: సునీతా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాధారణంగా హత్య కేసు నాలుగు, ఐదు రోజుల్లో తేలుతుందని, వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా కొనసాగుతోందని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు కావాలని, హత్య కేసు దర్యాప్తు ఇప్పటికే అక్కడే ఉందని బాధను వ్యక్తం చేశారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే తనకు న్యాయం జరుగుతుందని, ఒక్కోసారి హంతకులు మన మధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని, వాళ్లను కనుక్కోవాలి కదా? అని సునీతా రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య కేసును ఇంతవరకు ఎందుకు తేల్చలేకపోతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

2017 ఎంఎల్‌సి ఎన్నికల్లో నాన్న ఓటమి పాలయ్యారని, సొంతవాళ్లే మోసం చేసి ఓడించారని అనుకుంటున్నానని, ఓటమి పాలైన తన తండ్రిని మరింత అణచాలని చూశారని దుయ్యబట్టారు. మా నాన్న హత్య కేసులో  సిబిఐ దర్యాప్తునకు వెళ్దామని సిఎం జగన్‌ను అడిగానని, సిబిఐకి వెళ్తే ఎంపి అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్తారని చెప్పారని, ముందుగా సిబిఐ విచారణకు ఆదేశించిన పిటిషన్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రేమయం ఉందని, వాళ్లని సిఎం జగనే రక్షిస్తున్నారని, మా నాన్న హత్య కేసులో జగన్ మీద కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవినాష్‌రెడ్డికి శిక్ష పడాలని, శిక్ష పడుతుందని, అందరినీ అనుమానించాల్సిందేనని, విచారణ చేయాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. జగన్ కేసుల వలే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎపి అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ ఆర్ సిపి పార్టీకి ఓటు వేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన మద్దతుగా నిలిచారని ఆమె చెప్పారు. శివశంకర్ రెడ్డి అరెస్టు తరువాత మొత్తం కేసు మారిపోవడంతో నిందితులకు భయం మొదలైందన్నారు. సిబ్బందిపై కేసుల తరువాత కడప నుంచి సిబిఐ అధికారులు వెళ్లిపోయారని, హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ ప్రారంభమైందన్నారు. అవినాష్ రెడ్డి అరెస్టు కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసునని, సిబిఐ అరెస్టు చేయడానికి వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూశామా? అని సునీతా రెడ్డి ఎద్దేవా చేశారు. సిబిఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News