- ఎస్‌ఐ రవిగౌడ్
కొడంగల్‌ః గత కొంత కాలంగా విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు ఎంతగానో కలిచి వేస్తున్నాయని ఎస్‌ఐ రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ అదేశాల మేరకు సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆత్యహత్యలు, రోడ్డు భద్రత, మహిళలపై జరుగుతున్న నేరాలు, డయల్ 100, బాల్య వివాహాలు తదితర ఆంశాలపై కళాజాత బృందం సభ్యులు అవగాహన కల్పించారు.
బాగా చదివి ఉన్నత స్ధాయికి ఎదగాల్సిన సమయంలో ఆత్మహత్య అనే చిన్న తప్పుడు ఆలోచన వల్ల జీవితం అర్థాంతరంగా ముగుస్తుందన్నారు. ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని ఆశతో జీవించి పట్టుదలతో సాధించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే రోడ్డుపై వెళ్ళేటప్పుడు భద్రతతో పాటు ట్రాఫిక్ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. మన సమాజంలో మహిళలకు సముచిత స్ధానం ఉందని వారిని గౌరవించాలని పేర్కొన్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థులకు ఏలాంటి సమస్యలున్నా డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో విద్యార్థులు పడకుంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందంతో పాటు పోలీసు సిబ్బంది రజీయ, లలిత, సాయి ఐశ్వర్య , విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.