Saturday, December 21, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయొద్దు

- Advertisement -
- Advertisement -

మంత్రి తలసాని హెచ్చరిక

మనతెలంగాణ/ హైదరాబాద్: ఐదు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హైదరాబాద్ పౌరుడిగా బాధ కలుగుతుందని, హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవా ల్లో భాగంగా 15 రోజుల విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించడానికి సహకరించిన తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, సిఎస్ సోమేష్ కుమార్, ఎఫ్‌డిసి ఎండి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావిగుప్తాలతో కలిసి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, క్యూబ్, యూఎఫ్‌ఓ, పిఎస్‌డి డిజిటల్ సర్వీస్ ప్రతినిధులను శాలువాతో సత్కరించి మెమెంటోలను అందజేసిన మంత్రి, వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఎం కెసిఆర్ పాలన అందించారని, కావాలని కొంతమంది ఇలాంటి కుట్రలకు దారితీశారని, మేధావులు దీనిని గమనించాలని ఆయన సూచించారు. ఇలాంటి సంఘటనల వల్ల చిన్న వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషించే వాళ్లు ఇబ్బంది పడతారన్నారు. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల విషయంలో దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉన్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

552 స్క్రీన్‌లు…22.57 లక్షల మంది విద్యార్థుల వీక్షణ

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 8 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు 15 రోజులపాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గురించి నేటితరం వారిలో అధిక మందికి తెలియదని, దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం, స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలియ చెప్పాలన్న ఉద్ధేశంతో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించామన్నారు. రాష్ట్రంలోని 552 స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా, 22.57 లక్షల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారని వివరించారు.

ఫిల్మ్‌సిటీ ఆలోచన సిఎం చేస్తున్నారు: సిఎస్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ గాంధీ సినిమా పిల్లలకు చూపెట్టడం చాలా పెద్ద విషయమని ఈ విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని ఆయన తెలిపారు. దాదాపు 23 లక్షల మంది పిల్లలు ఈ సినిమాను వీక్షించారని, అన్ని శాఖల సమన్వయంతో ఇంత పెద్ద ఈవెంట్ విజయవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఫిల్మ్ సిటీ ఏర్పాటు ఆలోచన కూడా సిఎం కెసిఆర్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News