న్యూఢిల్లీ : నవంబర్ 1 నుంచి 19 తేదీల మధ్యలో ఎయిర్ ఇండియా విమానాల్లో ఎవరూ ప్రయాణించవద్దని ఖలిస్థానీ వేర్పాటు వాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ తేదీల్లో ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని పన్నూ పేర్కొన్నాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఈ దాడి జరిగే అవకాశం ఉందన్నాడు.
గత ఏడాది కూడా ఇదే విధమైన హెచ్చరికను పన్నూ జారీ చేశాడు. అనేక ఎయిర్‌లైన్ సర్వీస్‌లకు భారత్‌లో బాంబు బెదిరింపులు వస్తున్న తరుణంలో ఈ హెచ్చరిక రావడం గమనార్హం. అలాగే సిక్కు ఉగ్రవాది హరదీప్‌సింగ్ నిజ్జర్‌హత్యకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చెలరేగి కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో పన్నూ హెచ్చరిక రావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. సిక్స్ ఫర్‌జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జె) సంస్థాపకుల్లో ఒకడైన పన్నూ కెనడా, అమెరికా దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడు. ఈ సంస్థను 2007లో స్థాపించారు.
ఈ సంస్థను 2019 లోనే భారత్ నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత్ అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం పన్నూ అమెరికాలో ఉన్నట్టు సమాచారం. 2023 నవంబరులో పన్నూ ఓ వీడియో విడుదల చేశాడు. ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరు తిరిగి మారుతుందని, నవంబర్ 19న మూతపడుతుందని , ఆరోజు ఎయిర్ ఇండియాలో ఎవరూ ప్రయాణించరాదని అందులో హెచ్చరించాడు. గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంట్‌పై డిసెంబర్ 13 కి ముందే దాడి జరుగుతుందని హెచ్చరించాడు. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జ్ఞాపకంగా ఈ దాడి జరుగుతుందని హెచ్చరించాడు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ పోలీస్ గౌరవ్ యాదవ్‌ను హత్య చేస్తామని హెచ్చరించాడు.