Thursday, December 26, 2024

హిందీని బలవంతంగా రుద్దితే భాషా ఉద్యమం తప్పదు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

MK Stalin

చెన్నై: కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇంగ్లీషు స్థానంలో హిందీ ప్రవేశపెట్టాలని అధికార భాషపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ వ్యతిరేకించారు. బిజెపి వారి ఆలోచన విచ్ఛినకరంగా ఉందని కూడా ఆయన ఆరోపించారు. బలవంత పెడితే భాషా పోరు తప్పదని కూడా హెచ్చరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కమిటీ సమర్పించిన సిఫారసు రిపోర్టును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఆ కమిటీకి హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించారు. ఉమ్మడి భాషను భారత్‌లో రుద్దడం అన్నది ఆచరణపరంగా అసాధ్యం అన్నారు. ఒకవేళ హిందీ మాట్లాడేవారే భారతీయ పౌరులు అంటే మిగతా భాషలు మాట్లాడేవారు రెండో తరగతి పౌరులు కాగలరన్నారు. ఆయన ఈ వివరాలను నాలుగు పేజీల ప్రకటనలో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ను తుచ తప్పకుండా ఆచరణలో పెట్టాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతీయ భాషలు మాట్లాడే అందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ఇచ్చిందన్నారు. “హిందీని బలవంతంగా రుద్దొద్దని నేను మరోసారి హెచ్చరిస్తున్నాను” అన్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) హిందీకి లేనిపోని ప్రాధాన్యత కల్పించడాన్ని వ్యతిరేకిస్తుందని ఖరాఖండిగా చెప్పారు. ఇదివరలో 1960లో కాంగ్రెస్ కూడా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే హిందీ వ్యతిరేక ఉద్యమం చేశామన్నారు. ఇంగ్లీషును అనుసంధాన భాషగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని పేర్కొన్నారు. “ ఇండియా…హిందీయా కాదని” వ్యగంగా హోం మంత్రి అమిత్ షాను విమర్శించారు. 1960 నుంచే తమిళనాడు తమిళం, ఇంగ్లీషు అనే రెండు భాషల విధానాన్ని అనుసరిస్తోందన్నారు. భాషా కమిటీ చేసిన సిఫారసు భారత ఐక్యతను దెబ్బతీసేదని హెచ్చరించారు. హిందీని తమిళనాడు 1960 దశకం నుంచే వ్యతిరేకిస్తోంది. 1967లోనైతే హిందీని రుద్దడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ను కూడా దిక్కు దివాణం లేకుండా ఓడించింది. ఇక బిజెపి ఒక లెక్కా?…

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News