మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో బిజెపికి ఛాన్స్ ఇవ్వొద్దని, బిజెపి నేతలకు హిందుముస్లింల ఐక్యత కనపడటం లేదని, బిజెపికి ఒక్క అంగుళం జాగా ఇవ్వొద్దని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృంద కారత్ అన్నారు. శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. జమీందార్ రాంచంద్రారెడ్డిపై తన పంట కాపాడుకోవడం కోసం చాకలి ఐలమ్మ పోరాడిందని గుర్తు చేశారు. ఆ పోరాటానికి ఆంధ్ర మహాసభ అండగా నిలిచిందన్నారు. ఐలమ్మ పోరాటం మూడు వేల గ్రామాలకు విస్తరించిందని వివరించారు. బిజెపి మోడీ ప్రభుత్వం ఆ చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని హిందుముస్లిం మధ్య పోరాటంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ప్రపంచంలో అసమానతలు పెరిగిన దేశంగా మనదేశం నిలుస్తోందన్నారు. నిజాంపైన జరిగిన పోరాటం మంతం ప్రాతిపదికన జరగలేదని, హిందువులు, ముస్లింలు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఆ పోరాటంలో దాదాపు 2 వేల మంది చనిపోయారన్నారు.