Sunday, January 19, 2025

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంలో ఇడి అఫిడవిట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వరాదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురవారం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రాథమిక హక్కు కాదని ఇడి తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా గురువారం ఇడి తరఫున ఆ సంస్థ డిప్యుటీ డైరెక్టర్ భాను ప్రియ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసే హక్కు ప్రాథమిక, రాజ్యాంగపరమైన, చట్టపరమైన హక్కేమీ కాదని ఇడి తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కానప్పటికీ తమకు తెలిసి దేశంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఇడి తెలిపింది.

ఆప్ అధినేత మధ్యంతర బెయిల్ కోరడంపై ఇడి మండిపడుతూ గతంలో కూడా సమన్లను తప్పించుకోవడానికి కేజ్రీవాల్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయంటూ ఇదే సాకు చూపారని తెలిపింది. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మజూరు చేస్తే ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం సాధ్యం కాదని ఇడి వాదించింది. గడచిన మూడేళ్లలో దాదాపు 23 ఎన్నికలు జరిగాయని, ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇస్తే ఇక ఏ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి తరలించలేమని ఇడి తన అఫిడవిట్‌లో పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల చట్టానికి, సమానత్వానికి విరుద్ధమవుతుందని ఇడి వాదించింది.

చిత్తశుద్ధి లేని నాయకులంతా నేరాలు చేయడానికి అనుమతించి ఎన్నికల ముసుగులో దర్యాప్తును తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని ఇడి పేర్కొంది. సామాన్య పౌరుడికి మించి తమకు ప్రత్యేక హోదా ఉందని అరవింద్ కేజ్రీవాల్ కాని మరే రాజకీయ నాయకుడు కాని చెప్పుకునే అవకాశం లేదని ఇడి వాదించింది. దీని వల్ల దేశంలో రెండు రకాల తరగతులు ఏర్పడతాయ. ఒకరు సామాన్య పౌరులైతే మరొకరు రాజకీయ నాయకులని, సామాన్య పౌరులు చట్టానికి లోబడి ఉంటే ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పొందవచ్చన్న నమ్మకంతో చట్టాల నుంచి మినహాయింపును కోరే రాజకీయ నాయకులు మరొకరని ఇడి పేర్కొంది. జుడిషియల్ కస్టడీలో ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన రాజకీయ నాయకులు ఉన్నారని, కాని వారికి ఎన్నడూ మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని కూడా ఇది వాదించింది. పిఎంఎల్‌ఎ నేరాలు కాని కేసులలో కూడా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు జుడిషియల్ కస్టడీలో ఉండవచ్చని ఇడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News