Thursday, March 6, 2025

అప్పగించొద్దు… చిత్రహింసలు పెడతారు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : తనను భారత్‌కు అప్పగించవద్దని ముంబై భీకర ఉగ్రదాడి సంఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని యూఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. ఈమేరకు జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమ్మతి తెలిపిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను వేసిన అతడు… భారత్‌పై నిందలు వేశాడు. తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా, ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కో లోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్ లోనూ చుక్కెదురైంది. దాంతో అతడు గత ఏడాది నవంబరు 13న అమెరికా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దానిని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది.

దాంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ “26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయం లోనూ ఇదే నిర్ణయం తీసుకుంటాం. ” అని వెల్లడించారు. దాంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించనున్నట్టు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. రాణా , హెడ్లీపై ఉగ్రదాడులు , కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపు లోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News