న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఏ రకంగాను ఉపయోగించుకోవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. పోస్టర్లు, కర పత్రాల పంపిణీ, నినాదాలు చేయించడంతో సహా ఎటువంటి కార్యకలాపాలలోను పిల్లలను ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం.
ఎన్నికల ప్రచార కార్యకాలాపాలలో పిలలను ఉపయోగించవద్దని తెలిపిన ఎన్నికల సంఘం రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు చంటి పిల్లలను ఎత్తుకోవడం, వాహనంలో పిల్లలను తీసుకువెళ్లడం, ర్యాలీలలో పిల్లలను ఉపయోగించుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. పద్యాలు, పాటలు, మాటలు, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి చిహ్నంతో సహా ఏ రకంగాను పిల్లలను తమ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించడానికి వీల్లేదని సోమవారం ఒక ప్రకటనలో ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను ఆదేశించింది.
అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాజకీయ నాయకుడికి లేదా అభ్యర్థికి కొద్ది దూరంలో తమ తల్తిదండ్రులు లేదా గార్డియన్‌తో పిల్లలు ఉన్న పక్షంలో దాన్ని ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించబోమని ఇసి తెలిపింది. రానున్న పార్లమెంటరీ ఎన్నికల దృష్టా ప్రజాస్వామిక విలువల పరిరక్షణలో కీలక భాగస్వామిగా వ్యవహరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.