నాగర్‌కర్నూల్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టవద్దని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు.
సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 300 దరఖాస్తులను స్వీకరించారు. అందులో ధరణికి సంబంధించినవి 250 దరఖాస్తులు రాగా 50 దరఖాస్తులు వివిధ సమస్యలపై డిఈఓ, పంచాయతి రాజ్, మున్సిపల్, గిరిజన, సివిల్ సప్లై, ఎస్సి కార్పొరేషన్ తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి నర్సింగ్ రావు, సిపిఓ భూపాల్, కలెక్టర్ పిఎస్ ఖాజా మైనుద్దీన్, ఈడిఎం నరేష్, ధరణికి సంబంధించిన ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.