Thursday, January 23, 2025

వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు

- Advertisement -
- Advertisement -

అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
అటవీ సంరక్షణాధికారి డోబ్రియల్ హెచ్చరిక

మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యావరణ రక్షణలో పెద్ద పులి పాత్ర ఉన్నత స్థానంలో ఉంటుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్‌ఎం. డోబ్రియల్ అన్నారు. ఇటీవల కాగజ్ నగర్‌లో రెండు పెద్ద పులులు చనిపోవటం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. అటవీశాఖ చేపట్టిన మంచి చర్యల వల్ల కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కారిడార్) పులులకు శాశ్వత నివాసంగా మారుతోందని, ఇలాంటి సమయంలో పులుల మరణాలు జరగకుండా ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు.

అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరులో అలసత్వం, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తీవ్ర చర్యలు ఉంటాయని డోబ్రియాల్ హెచ్చరించారు. చీఫ్ కన్జర్వేటర్ స్థాయి నుంచి బీట్ అధికారి వరకు ప్రతీ ఒక్కరూ తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలని, కేటాయించిన అటవీ బీట్లలో ఫుల్ పెట్రోలింగ్ (కాలినడక పర్యవేక్షణ) చేయాలని ఆదేశించారు. అడవులకు నష్టం చేసేవారిని, వన్యప్రాణులను హతమార్చే వారి పట్ల అత్యంత కఠినమైన అటవీ చట్టాలు ఉన్నాయని వాటి ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఫార్మర్లతో పాటు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ద్వారా అడవులు, వన్యప్రాణులను రక్షించుకోవచ్చని తెలిపారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెంచాలని సూచించారు. చెక్ పోస్టులను పటిష్టం చేయటంతో పాటు, నైట్ పెట్రోలింగ్ ను మరింతగా పెంచాలని, ఆధునిక సాంకేతికతను వాడాలని ఆయన కోరారు. అనంతరం పిసిసిఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎం. సి పర్గెయిన్ మాట్లాడుతూ ..రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన క్యాచ్ ద ట్రాప్ (ఉచ్చులు, వలలను పట్టు కోవటం) సమర్థవంతంగా కొనసాగుతోందిని, ఇప్పటి వరకు 1320 ఉచ్చులను అటవీ శాఖ స్వాధీనం చేసుకుందని, సుమారు ఏడు వందల కేజీల ఇనుప వస్తువులను సిబ్బంది పట్టుకున్నారని చీఫ్ వైల్ లైఫ్ వార్డెన్ ఎం. సి పర్గెయిన్ వెల్లడించారు. అచ్చంపేట, సిర్పూర్ కాగజ్ నగర్ జిల్లాల్లో 12 చొప్పున కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, ఫీల్డ్ డైరెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News