Wednesday, January 22, 2025

ముస్లిం కోటా రద్దుపై రాజకీయ ప్రకటనలు చేయవద్దు: సుప్రీం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు అంశంపై కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాజకీయ అంశం చేయడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా పరిగణించింది. కర్నాటకలో ముస్లిం కోటా రద్దు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయరాదని హెచ్చరించింది. దీనిపై కొంత గైరవం, హుందాతనం పాటించాలని సూచించింది. అనంతరం కేసు విచారణను జులై నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అంతకు ముందు న్యాయ పరిధిలో ఉన్న అంశాలపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయరాదని, వాటికి రాజకీయాలతో సంబంధం లేదని న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, బివి నాగరత్న, అహ్సనుద్దీన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని పదేదపదే ప్రస్తావించారు. దీనిపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ నాయయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ ముస్లింలకు తమ పార్టీ రిజర్వేషన్లను ఉపసంహరించుకున్నట్లు అమిత్‌షా గర్వంగా చెబుతున్నారని అన్నారు.

కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అదే విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సొలిసిటర్ జనరల్‌గా, ఒక న్యాయవాదిగా మీరు వాదించవచ్చని, కానీ బహిరంగ ప్రదేశంలో మరొకరు ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని జస్టిస్ జోసెఫ్ ఆయనతో అన్నారు. ప్రతి రోజూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని దవే అన్నారు. అయితే దవే ఈ వ్యాఖ్యలు చేయడంపై మెహతా అభ్యంతరం చెప్పారు. కాగా కోర్టు ఒక రాజకీయ వేదిక కావడాన్ని తాము అనుమతించబోమని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇంతకు ముందు ఈ అంశంపై తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వుల దాకా కొనసాగుతాయని బెంచ్ స్పష్టం చేస్తూ కేసు తదుపరి విచారణను జులై నెలకు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News