రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు సూచన
బెంగళూరు : ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు కన్నడ తప్పనిసరి అని ఒత్తిడి తేవద్దని రాష్ట్రప్రభుత్వానికి, యూనివర్శిటీలకు కర్ణాటక హైకోర్టు సూచించింది. చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్తి , జస్టిస్ సచిన్ శంకర్ మగడం లతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సంస్కృత భారతి కర్ణాటక ట్రస్టు, కెజి శివకుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. విద్యార్థులు తమ ఇష్టంపై ఏ భాషనైనా ఎంపిక చేసుకోవచ్చని డిసెంబర్ 16 న విద్యార్థులకు కోర్టు స్వేచ్ఛ కల్పించింది. అయితే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి కన్నడ భాష తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడాన్ని పిటిషన్‌దారులు సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ విధానపరమైన నిర్ణయంలో తొందరపడవద్దని డిసెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వానికి, యూనివర్శిటీలకు కోర్టు సూచించినా ఇప్పుడు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుత విద్యాసంవత్సరాలనికి తమ ఇష్టప్రకారం కావలసిన భాషను ఎంపిక చేసుకోలేక పోతున్నామని పిటిషనర్‌విద్యార్థుల తరఫున న్యాయవాది శ్రీధర్ ప్రభు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.