సుప్రీంకోర్టు తీర్పు ఫలితం..
హైదరాబాద్: అనధికార లేఅవుట్లలో అమ్ముడుపోని ప్లాట్ల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతి లేని లేఅవుట్లలో గతంలోనే విక్రయించిన ప్లాట్లను మినహాయించి డెవలపర్ల వద్ద మిగిలిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకుంటూ తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ డెవలపర్లు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. అనుమతిలేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. 2021 ఆగస్టు 23వ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఈ నెల 18వ తేదీన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రతివాదిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కొత్తగా చేర్చింది. దాంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అనుమతిలేని లేఅవుట్లలో ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరగని ప్లాట్ల డాక్యుమెంట్లకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ(హెచ్‌ఎండి), డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్(డిటిసిపి) బ్రేక్ వేసింది. రిజిస్ట్రేషన్ కోసం రోజూ 6 వేల దాకా డాక్యుమెంట్లు నమోదవుతుండగా.. తాజా ఉత్తర్వులతో సగటున 10 డాక్యుమెంట్ల నమోదు ఆగిపోనుందని సమాచారం.