‘థూ నీయమ్మ దరిద్రపు రోడ్దు, ఇంత అద్దుమానపు రోడ్దు యాడ సూళ్ళేదు’ ప్రయాణ అగచాట్లలో ఆ రోడ్దును తిట్టుకోవటం రోడ్దు దాటాక మరిచిపోటం ఆ ఊరోళ్లకు మామూలే.. విడివిడిపోచలు ఆ ఊరి పశువులకు రోజూ గడ్ది మోపులవుతుంటాయి కానీ.. మనుషులను ఒక్కటి కానివ్వని కొన్ని పరిస్థితులున్నాయ్ ఆ ఊళ్ళో.. రకరకాల పార్టీలు, కులాలు, సామాజిక స్థితులు బాధితులందరినీ ఒక్కటి కానివ్వటం లేదు.. అందుకని ఎవరికివారు విడివిడిగా వాపోవటమే జరుగుతోంది…
‘రోడ్డు బాగు చెయ్యమని ధర్నా చేద్దాం’.. అని ఒకసారి అనుకున్నారు కానీ ఊరి నుంచి టవునుకుపోయేటోళ్లు టవును నుంచి ఊళ్ళోకి వచ్చేటోళ్లు అంతా తమ ఊరివాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు, పాలోళ్ళు కనుక తమ వాళ్ల రాకపోకలను అడ్డుకొని అంతరాయం కల్పించడం ధర్మం కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నారు..
‘ఓట్లను బహిష్కరిద్దాం.. కలెట్టర్ దిగొస్తడు రోడ్దు సౌలత్ అదే వొస్తది అని సర్పంచ్ ఎన్నికల నుంచి ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎంఎల్‌ఎ, ఎంపి ఎన్నికలకు ముందు తీర్మానించుకుంటారు. కానీ తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, వాళ్లనోళ్లను కరెన్సీ నోట్లతో కట్టి పడేస్తారు.. పార్టీలు, కులాలు అందుకు ఊతమిస్తుంటాయి..
‘ఊరు ఇంకెంత దూరం ఉంటుంది’.. చూపు ఆనినంతమేరా అధ్వాన్నంగా కనపడుతున్న మట్టి రోడ్డును చూస్తూ అడిగాడు ఎంఎల్‌ఎ అభ్యర్థి రామిరెడ్ది.. ఇంగో మూడు కిలోమీటర్లుంటది సార్ అన్నాడు అతని పార్టీ నాయకుడు.. ఊళ్ళో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కార్లు, ప్రచార రథం మంది మార్బలంతో వచ్చాడు రామిరెడ్డి ఎన్నికల ప్రచార బృందాన్ని స్వాగతించి ఊళ్ళోకి తీసుకుపోయేందుకు అక్కడికి మోటార్ సైకిళ్లతో చేరుకున్నారు గ్రామ, మండల పార్టీ శ్రేణులు.. ‘రోడ్దు అసలేం బాలేదు సార్, గోతులతో కంకరతేలి ఉంది కొన్నిచోట్ల బురదగుంటలు కూడా ఉన్నాయ్ టైర్లు దిగబడే ప్రమాదం ఉంది’ అని చెప్పాడు డ్రైవర్.. ‘మోటార్ సైకిళ్లమీద ఎలాగో వెల్దాం సార్ ఊళ్ళో మొత్తం పదివేల దాకా ఓట్లున్నాయ్’ అని పార్టీ నాయకుడు చెబుతుండటంతో.. కారు దిగి మోటార్ సైకిల్ ఎక్కాడు.. ఎంత తప్పిద్దాం అనుకున్నా టైర్లు ఒకటికాకపోతే మరో గుంటలో పడుతూ లేస్తుండటంతో టూ వీలర్ గంతులేస్తోంది.. ఎంఎల్‌ఎ అభ్యర్ధి సహా ప్రచార బృంద నడుములు హూనమవుతున్నాయి..
ఇళ్ళల్లో ఏడెనిమిదింటికల్లా మలిగిపోయే మాటలు గత నాలుగైదురోజులుగా బుడ్ది దీపాలతో పాటు వెలుగుతున్నాయ్.. ‘ఏ రేత్తిరైనా అత్తం..పెనగడ దెగ్గరికి ఏసి ఉంచండి గొళ్లెం సప్పుడు జేయంగనే తలుపుదీయండి’.. నులకమంచాల్లో, ఈత సాపల్లో పండుకున్నోళ్ల చెవుల్లో కోడి పుంజులు కొక్కొరోకో అనే దాక ఈ మాటలే వినపడుతున్నాయ్..
‘అచ్చినారక్కా.. బర్రెకు మేతవేస్తున్న ఈరమ్మ చెవిలో గుసగుసగా అడిగింది పక్కింటి చుక్కమ్మ.. ‘రామరామ యాడిదమ్మా మీ బావ నేను ఎదురుసూసి ఎదురుసూసి యాసారినం ఇగరాలె అగరాలె’ అంది ఈరమ్మ అంతే గుసగుసగా..
‘కొంటెకారు గుంపులుగుంపులుగా బజాట్లె అటిటు సారీలు దోల్తాంటే ఇయ్యాలనన్నా రావచ్చును అనుకుంటిమి రోజు దెగ్గెరబడతంటె ఇగెప్పుడంటఅచ్చేడిది’… తన అసహనం వ్యక్తం చేసింది చుక్కమ్మ.. ‘ఇగనన్న అస్తరో మాటలతోనే సరిపుచ్చుతరో’.. కుడితి పోస్తూ అంది ఈరమ్మ.. ‘రాకుంటె మనం బోవుడు లేదు ఏసుడు లేదు అయినా ఈళ్ల ఇంట్లెకెల్లిచ్చేటియా ఏంది’.. అంది చుక్కమ్మ మూతితిప్పుతూ.. ‘అగో సూడు పొద్దంత ఆళ్ళొచ్చి అతికిచ్చి ఈల్లొచ్చి అతికిచ్చి తలుపులు నామరూపాల్లేకుండైనయ్’.. అంది ఈరమ్మ డోర్ పోస్టర్లు పాంప్లేట్ల వైపుచూపిస్తూ..
‘అటు రెడ్డేనాయ్ ఇటూ రెడ్డేనాయ్ ఈపాలి టగ్గాపోర్ ఉంటది పంచుడు సుత అట్టనే ఉంటది మునపటికన్నా ఎక్కువుంటది అని బగ్గ పెచారమాయె మాటలైతె మస్తుగ ఇనబడతన్నయ్ గానీ ఎవళస్తనేలేరు’.. రావి చెట్టు ముచ్చట్లలో ఈ ఆరోపణలే చోటు చేసుకుంటున్నాయ్..
ఆ రాత్రి పెంపుడు కుక్క భౌ మనగానే గబాల్న వెళ్లి తలుపు తీశాడు ఓదేలు.. అంత చీకట్లో వచ్చిందెవరెవరో గుర్తుపట్టాడు.. కుక్క మొరుగుతూనే ఉంది.. దాన్ని బయటకు వెళ్లగొట్టి పెనగడ వేసి వస్తుండగా ‘గబుక్కున రా అన్నా.. తలుపేయ్ తలుపేయ్ వాళ్లీళ్లు సూడగాల’ అన్నాడు వచ్చిన వాళ్లలో ఒకతను.. ‘మొత్తం ఎన్నున్నయ్ మీ ఇంట్లె’ అని అడుగుతూ తన చేతిలోని లిస్టు చూసేపనిలో నిమగ్నమయ్యాడు ఇంకో అతను..’ ఓదేలు ఇగ ఇసుంటరా’ అని పిలిచాడు వాళ్లతో వచ్చిన ఖద్దరు చొక్కా పెద్దమనిషి.. దేవుడి ఫోటో ముందుకు పిలిచి ‘ఇగో ఒకో ఒటుకు ఇంత’ అని మొత్తం చేతులో పెట్టి..’ ఒక్క ఓటు సుత బీరుబోగూడది.. మొత్తానికిమొత్తం పడాల టవున్లో కాలేజీ సదువుతన్న మీ పిలగాడ్ని గూడ పిలిపిచ్చాలా’ అన్నాడు.. ‘దేవుడి సమచ్చంలో డబ్బు ముట్టజెపుతన్నవ్ మాటదప్పుతనా, అంత బుద్ధితక్కువోడ్ని గానులే’ అన్నాడు ఓదేలు డబ్బు జేబులో పెట్టుకుంటూ.. ‘సరె పోయొస్తం చెల్లెమ్మా చెప్పింది మరవకుండ్రి’ అంటూ వొచ్చినోళ్లు పెనగడ దీసుకోని బయటకు పోతుంటే మళ్లీ మొరుగుతూ ఇంట్లోకొచ్చింది కుక్క.. ‘మొత్తం రొండొందల యాబయ్ ఉన్నయే’… అని ఓదేలు అంటుంటె ‘ఓటుకు ఎంతిచ్చినట్టు’ అని అడిగింది ఈరమ్మ..’ ఏముంది మనింట్లె అయిదు ఓట్లున్నయ్ అంటే ఓటుకు యాబయ్’ ఇచ్చినట్టు అని అన్నాడు..
మరుసటి రాత్రి మళ్లీ కుక్క మొరిగేసరికి లేచి వెళ్లి తలుపు తీశాడు.. ‘బావా ఇగో మీ ఇంట్లె అయిదుఓట్లకు అయిదు అరవయ్‌ల సొప్పున మూడొందలు’ అని మరొక బృందం ఇవ్వబోతుంటె.. ‘ఏయ్ మాకు డబ్బొద్దు ఏమొద్దు.. మేము ఓటమ్ముకునేటోళ్లం గాదు’ అని తిరస్కరించాడు .. ‘అరే అట్లెందుకు అనుకుంటవు ఏదో నా సంతోషానికిస్తన్న..రెడ్దిగారు ఇచ్చిరమ్మని నన్నుతోలిండు.. ఇగబట్టు నువ్వు తీస్కోకోలేదని తెలిస్తే మల్ల నాకు మాటొత్తది’ అంటూ బలవంతంగా ఓదేలు చేతి లాగి అరచేతిలో పెట్టే ప్రయత్నం చేసినా ససేమిరా వినలేదు.. ‘మీరు బలవంతంగా పెట్టిపోతె ఊరి గుళ్లె కానుకేత్త మీపేర్న’ అన్నాడు ఓదేలు.. ఓదేలు ఓట్లు తమకు పడేవి కావని తెలుసు అయినా తమవంతుగా ప్రయత్నం చేసి కమిట్మెంట్ పొందాలని వొచ్చారు వాళ్లు ప్రయత్నం ఫలించకపోవటంతో ఆశలు ఒదులుకొని మరో ఇంటివైపు నడిచారు ‘మల్లోపాలి ఆలోచించుకో బావా’ అంటూ .. ‘యాదయ్య ఎంకా రెడ్ది కాడ గూడా తీస్కున్నడంట పైసల్’ ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరెవరు అట్లా ఇద్దరివద్దా తీసుకున్నారో క్షణాల్లో ఊరంతా పాకిపోయింది..
‘ఒద్దు వద్దని మొత్తుకుంటన్నా ఇనవయ్తివి డబ్బుకు ఆశపడి ఇద్దరి దగ్గెర గుంజితి వి రొండేపులా దీసుకున్నమని ఊరు కోడై కూత్తన్నది’ అన్నడు ఎలమంద తన భార్య ధనమ్మని నిందిస్తూ.. ‘అయితాయె ఏంది అనుకుంటె అనుకోనీ ఇంట్లె ఆరోట్లున్నయ్ మూడు ఒకళ్లకి మూడొకళ్లకి ఏద్దం ఎవుళ్లకి జేసిన అన్నాయమేమున్నది’ అని నింపాదిగా అంది..
కాలం గడిచింది ఓదేలు కాలం చేశాడు. అతని కొడుకు వినోద్ తరంవొచ్చింది.. పోలింగుకు మరో వారం గడువుందనగానే పంచుడు షురూ అయ్యింది.. అభ్యర్థుల తరపున ఎవరికి వారు బాహాటంగానే ఇంటింటికీ తిరుగుతూ డబ్బు పంచుతున్నారు..
ఓదేలు తరం నుంచి ఇప్పటి వరకు అతని ఇంటి పరిస్థితి ఆ ఊరి స్థితి ఏమాత్రం మారలేదు రోడ్లు, సదుపాయాలు యథాతథంగా ఉన్నయ్.. ఓటు విలువా పెరగలేదు కానీ ఓటరు విలువ మాత్రం అమాంతం అధికమయ్యింది.. ఓటు కొనే తీరు మారింది తన ఇంట్లో నాలుగు ఓట్లకు ఓటు మూడు వేల చొప్పున పన్నెండు వేలు తీసుకున్నాడు వినోద్.. అంతకు ముందు రోజే మరో అభ్యర్థి నుంచి ఓటుకు రెండు వేల చొప్పున తీసుకొని ఉన్నాడు.. మూడు వేలు ఇచ్చిన అభ్యర్థే అంటున్నాడు ‘డబ్బులు ఎవరిచ్చినా తీసుకో ఓటు మాత్రం మనకే వెయ్’ అని..
వినోద్ కొడుకు అయిదేళ్ల చిన్నూకి రెండు రోజులుగా వాంతులు విరేచనాలవుతుంటే ఊళ్ళోని ఆర్‌ఎంపికి చూపించారు ఆ రాత్రి చిన్నూకి అనారోగ్యం ఎక్కువయ్యింది.. ఆర్‌ఎంపి పరీక్షించి సీరియస్‌గా వుంది వెంటనే టవున్ హాస్పటల్ కి తీసుకుపోవాలని చెప్పాడు..
ఊరి రోడ్డు దుస్థితి కారణంగా ఆటోలు తిరగవు.. గతంలో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఆర్‌టిసి బస్సు పడుతూ లేస్తూ వచ్చిపోతుండెది.. గుంటల్లో కుదుపుల వల్ల తరచూ మరమ్మత్తులకు గురవుతుండటంతో బస్సు రావటం ఆగిపోయింది.. గత్యంతరం లేక వినోద్ ఆర్ ఎంపితో కలిసి తన కొడుకును టూ వీలర్ మీద కూర్చోబెట్టుకొని మండల కేంద్రం వైపు స్టార్ట్ చేశాడు.. రోడ్డు గుంటల్లో బండి ఎత్తేస్తుండేసరికి పిల్లోడు మరింత నీరసించాడు.. ఎలాగో ప్రాణం అరచేతిలో పట్టుకొని ప్రయాణిస్తుండగా టూ వీలర్ చక్రం బురదలో దిగబడి ముందుకు కదలక మొరాయించింది.. పావుగంట శ్రమించి ఎలాగో బయటకు లాగి కొంత దూరం పోగానే మొనతేలిన కంకర రాళ్ళు గుచ్చుకొని టైర్ పంచర్ అయ్యింది..
సకాలంలో వైద్యం అందకపోవటంతో ఐదేళ్ల చిన్నూకు నూరేళ్లు నిండాయి.. కొడుకు శవాన్ని గుండెకు హత్తుకుంటూ పెద్దగా అరుస్తూ వినోద్ అక్కడే కూలబడ్డాడు.. చిన్నూతల్లి, నానమ్మ ఈరమ్మ, ఇతర బంధువులూ పెద్ద పెట్తున ఏడుస్తూ అక్కడికి చేరుకున్నారు ‘శవాన్ని ఇక్కడి నుంచి తీద్దాం ఊళ్ళోకి తీసుకపోదాం’ అని ఎవరో అనేసరికి చిన్నూ తల్లి ఆక్రోషంగా గొంతు విప్పింది..’ రోడ్డు బాగుంటే నాబిడ్డ నాకు దక్కేవాడు, ఓటును నోటుకు అమ్ముకోటం వల్లే మనకు ఈగతి పట్టింది.. ఇలాంటి కడుపుకోత ఇంకెవరికీ రావొద్దు.. శవాన్ని ఇక్కడి నుంచి తీయొద్దు ఇక్కడే పూడ్చుదాం ఓటును అమ్ముకునేవాళ్లందరికీ బుద్ధొస్తుంది’ అని గుండెలవిసేలా రోదిస్తోంది.. ఈరమ్మ, ఆమె తరం వాళ్లంతా ఓటును నోటుకు అమ్మే సంస్కృతికి సాక్షుల్లా, దోషుల్లా పశ్చాత్తాపపడుతున్నారు.
కంచర్ల శ్రీనివాస్
9640311380