న్యూఢిల్లీ: మా బలాన్ని తక్కువగా అంచనావేసి, మా సైన్యం సహనాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించి తప్పు చేయొద్దని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె హెచ్చరించారు. చైనానుద్దేశించి నరవణె ఈ హెచ్చరిక చేశారు. గల్వాన్ ఘటనలో అమరులైన 20మంది భారత సైనికుల త్యాగాలు వృథా కావని ఆయన అన్నారు. ఉత్తర సరిహద్దులో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా ప్రయత్నించిందని, అందుకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందని నరవణె అన్నారు. ఇరు సైన్యాల మధ్య 8 నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభనను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు. శుక్రవారం ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరిగిన పరేడ్‌లో నరవణె తన సందేశమిచ్చారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్‌సింగ్, ఐఎఎఫ్ చీఫ్ ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్‌కెఎస్ భదౌరియా హాజరయ్యారు.