మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు సేవలందించే 5 నుంచి 6 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీచర్లు, వీఆర్‌ఏలు, వీఆర్వోలు ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14 ఏళ్లు తెలంగాణలో ఉద్యమంలో, రెండు సార్లు పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశానని, ఎంతోమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రావట్లేదని దరఖాస్తులు ఇచ్చారని ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులే ఎక్కువ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు చైతన్యవంతమైతే తప్పుచేసే వాళ్లను గల్లా పట్టి అడుగుతారని తండాలు, బస్తీల్లో స్కూళ్లన్నీ మూత పడ్డాయని రేషనలైజేషన్ పేరిట టీచర్లను తగ్గిస్తున్నారని చాలాచోట్ల గవర్నమెంట్ స్కూళ్లలో స్కావెంజర్లు లేవన్నారు. ప్రధానోపాధ్యాయులు వార్డెన్లుగా, అటెండర్లుగా పని చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి అధికారులకు లేదని రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. ధనిక రాష్ట్రమని, సంపదకు కొదవలేదని, అన్నింట్లో నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. సమైక్య రాష్ట్రంలో 294 మంది ఉన్న సభలో అసెంబ్లీలో మాట్లాడటానికి సమయం ఇచ్చేవారని, కాని నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధకరమన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా తాము కొట్లాడుతామని పేర్కొన్నారు.