హైదరాబాద్ : విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరుతో వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్‌ని నమ్మొద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి జి. రఘుమారెడ్డి కోరారు. విద్యుత్ వాడకం బిల్లుల చెల్లింపు పేరుతో కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్ ల ద్వారా, ఫోన్‌ల ద్వారా సంప్రదించి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రివేళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని మోసపూరితంగా వినియోగదారులను బెదిరించి వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకుని వారి అకౌంట్ల నుంచి నగదును విత్ డ్రా చేసుకుంటున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ వినియోగదారుల బిల్లుల వసూలు/ చెల్లింపుల కోసం సంస్థ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్/ డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డుల వివరాలు అడగరని, బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని తెలిపారు. విద్యుత్ సంస్థ బిల్లుల చెల్లింపు కోసం ఎటువంటి వెబ్ సైట్ లింకులు మెసేజ్ ద్వారా పంపమని తెలిపారు.
వినియోగదారులు చెల్లించాల్సిన బిల్లు, బకాయిల వివరాలు సంస్థ నెల నెలా జారీచేసే బిల్లులో క్లుప్తంగా పేర్కొనడం జరుగుతుందన్నారు. వినియోగదారులు తాము బిల్లు చెల్లించిన కూడా, ఒక వేళ ఎవరైనా వ్యక్తులు తమకు ఫోన్ చేసి గాని/ మెసేజ్ ద్వారా గాని విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందని పేర్కొంటే తాము చెల్లించిన వివరాలను సంస్థ వెబ్ సైట్ www.tssouthernpower.com, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ మొబైల్ ఆప్ లో సరి చూసుకోవాలి. ఏమైనా తేడాలు ఉంటే సంస్థకు ఆన్‌లైన్ ద్వారా గాని, సంబంధిత సెక్షన్ ఆఫీసర్‌ని సంప్రదించి సరిచేసుకోవాలని వినియోగదారులకు ఆయన సూచించారు. రాత్రివేళ విద్యుత్ సరఫరా నిలిపివేయడం సంస్థ చేయదని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో తమ బ్యాంకు అకౌంట్ వివరాలు గాని, మోసపూరిత లింకులు మెసేజ్‌ల ద్వారా గాని పంపినా వినియోగదారులు పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయాలని రఘుమారెడ్డి కోరారు.