Friday, November 22, 2024

డెల్టా ప్లస్ పట్ల ఆందోళన వద్దు

- Advertisement -
- Advertisement -

Don't worry about Delta Plus variant:Union Health ministry

మరింత అధ్యయనం జరగాలి
కేంద్ర ఆరోగ్యశాఖ

న్యూఢిల్లీ: ప్రస్తుతానికి డెల్టా ప్లస్ వల్ల ఆందోళన అవసరం లేదని, దానిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రెండో ఉధృతిలో డెల్టా వేరియంట్ ప్రధాన పాత్ర పోషించింది. దాని నుంచి మరో వేరియంట్ ఆవిర్భవించింది. దానిని డెల్టా ప్లస్‌గా ప్రపంచ డేటాలో గుర్తించారని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ తెలిపారు. యూరప్‌లో దానిని ఈ ఏడాది మార్చిలో గుర్తించారు. ఈ నెల 13న దాని గురించి ప్రపంచానికి వెల్లడించారని ఆయన తెలిపారు. డెల్టా ప్లస్ అనేది ఆసక్తిని కలిగిస్తున్న ఓ వేరియంట్. అయితే, దానిని ఆందోళనకరమైందిగా వర్గీకరించలేదు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు అది లొంగడం లేదని చెబుతున్నారు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉన్నదని వికె పాల్ అన్నారు. ఆరోగ్యశాఖ తరఫున డెల్టా ప్లస్‌పై వికె పాల్ వివరణ ఇచ్చారు.

భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందిన కొవిడ్19 వేరియంట్ సాంకేతిక నామం బి.1.617.2. దీనిని మొదట భారత్‌లోనే గుర్తించారు. ఇది మ్యుటేషన్(ఉత్పరివర్తన) చెందడం వల్ల వచ్చిందే డెల్టా ప్లస్ లేదా ఎవై.1. ఈ వేరియంట్ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన కాక్‌టెయిల్ చికిత్స మోనోక్లోనల్ యాంటీబాడీస్ ధెరపీకి లొంగకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, డెల్టా ప్లస్ కేసులు భారత్‌లో ఎక్కువగా నమోదు కాలేదని నిపుణులు చెబుతున్నారు. దాంతో, తక్షణ ఆందోళన ఏమీలేదని వారు భరోసా ఇస్తున్నారు. అయితే, రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి ఈ వేరియంట్ సోకితే వారిలోని రోగనిరోధక వ్యవస్థకు లొంగుతుందా..? లేదా..? అన్నదానిపై అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మన దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది మే 7న అత్యధిక కేసులు నమోదు కాగా, దాంతో పోలిస్తే తాజాగా కేసుల సంఖ్య దాదాపు 85 శాతం తగ్గాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News