ఓపిక పట్టండి ఆదివారం సంబరాలు చేసుకుందాం
బిఆర్‌ఎస్ నేతలతో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంపై బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పరేషాన్ కావొద్దని.. బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ విజయం సాధించబోతుందని సిఎం కెఎసిఆర్ పార్టీ నేతలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ప్రగతిభవన్‌లో శుక్రవారం తనను కలిసి ప్రస్తుత మంత్రులు, ఎంఎల్‌ఎలతో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై సిఎం కెసిఆర్ చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసినట్లు సమాచారం.
శాసనసభ ఎన్నికల ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని.. రాష్ట్రాన్ని పాలించబోయేది బిఆర్‌ఎస్ పార్టీయేనని చెప్పినట్లు తెలిసింది. ఆదివారం వరకు ఓపిక పట్టాలని ఆ రోజునే సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఆదివారం(డిసెంబర్ 3) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.