న్యూఢిల్లీ : అత్యంత సాంక్రమిక శక్తి కలిగినట్టు భావిస్తోన్న ఎక్స్ ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో వెలుగు చూశాయి. దీంతో మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో కొవిడ్ వర్కింగ్ గ్రూప్ స్పందించింది. కొత్త వేరియంట్‌పై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తీవ్రవ్యాధికి కారణమవుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని, వేగంగా వ్యాప్తి చెందుతుందనడంపైనా ఎలాంటి సమాచారం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చీఫ్ ఎన్‌కే అరోఢా పేర్కొన్నారు. ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ1,బీఏ 2 ల మిశ్రమం ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఎక్స్ ఈ వేరియంట్ తొలుత బ్రిటన్‌లో వెలుగు చూసింది. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు ఉన్న ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్ వేరియంట్‌కు దాదాపు 10 శాతం ఎక్కువ ఉన్నట్టు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పనిలేదని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చెబుతోంది.