Sunday, December 22, 2024

రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ

- Advertisement -
- Advertisement -
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు

మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్‌నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయించిందని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రైతుల పక్షాన నిలబడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలా… రైతుల ఉసురు తీసిన కాంగ్రెస్ పార్టీ కావాలా… అని తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. రైతుబంధు నిధులు ఆగాయని ఆగం కావద్దని డిసెంబర్ 6వ తేదీన మళ్ళీ మీమీ బ్యాంకు ఖాతాలలోకి డబ్బులు వచ్చేటట్లుగా చేస్తానని సిఎం కెసిఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. రైతుల నోటికాడ బువ్వను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగరగొట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకుంది. రైతుబందు ఇస్తుంటే వాటిని అపేందుకు ఎలక్షన్ కమిషన్‌కు మళ్లీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎలక్షన్ కబిషన్ రైతుబంధు ఇవ్వోద్దని ఆర్డర్‌ను ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఇది గమనిస్తున్నారు. రైతులను ఆదుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నానని, అలాంటి తాను రైతులకు మేలు జరుగుతున్నప్పుడు ఎవ్వరైనా కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అడ్డుకున్నారని తెలిస్తే మనస్సుకు బాధకలుగుతుందని సిఎం కెసిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఏడాది ఎకరాకు రైతుకు రూ.10 వేల రైతుబంధును అందిస్తోందన్నారు. పెట్టుబడి సాయంగా రైతులకు ఇది ఎంతో మేలు చేస్తోందన్నారు. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ పథకాన్ని తెలంగాణ రైతులకు అందిస్తున్నామని అని అన్నారు. బీఆర్‌ఎస్ అధికారాన్ని చేపట్టగానే రైతు బంధు ఎకరాకు 16 వేల రూపాయలకు పెంచుతామన్నారు. యాభై యేళ్ల కాంగ్రెస్ పాలనను.. పదేళ్ల పాలనను తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎవరికి పట్టం కడుతారో 30న నిర్ణయం తీసుకోవాలని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదిలేదు.. సచ్చేదిలేదన్నారు. 20 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కానుందన్నారు. అంతేగాక చేవెళ్ళ, మొయినాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల ప్రజలు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న 111 జివోను పూర్తిగా ఎత్తేస్తామని, ఈ జీవో పరిధిలోకి వస్తున్న 82 గ్రామాలను సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్దంచేశామని సిఎం చెప్పారు. అంతేగాక ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సేవాలాల్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుతామని, ఆయన జయంతి రోజును సెలవు దినంగా చేస్తామని సిఎం హామీ ఇచ్చారు. చేవెళ్ల ప్రాంతాన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సస్యశ్యామలం చేస్తామని కెసిఆర్ చెప్పారు. చేవెళ్ల హైదరాబాద్ ప్రాంతానికి కూత వేటు దూరంలో ఉంది. రానున్న రోజుల్లో చేవెళ్ల అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. చేవెళ్ల ప్రజలు చాలా వివేకవంతులు వారికి అన్ని తెలుసు.. మంచివారిని ఎన్నుకుంటేనే అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని వారు గమనించారు. అందుకే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను మళ్లీ గెలిపించుకుంటారనే నమ్మకం తనకు ఉందని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల ఎస్సి నియోజకవర్గం ఇక్కడి దళితులందరూ బీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేయాలన్నారు. ఒకే విడతలో దళితులందరికి దళితబంధు పథకాన్ని అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. గతం లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫించన్‌లను వేయికి పెంచాం… అనంతరం మళ్లీ అధికారం వచ్చాక రెండు వేలకు ఫించన్‌లను లభ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.ఐదు వేల ఫించన్‌ను అందిస్తామన్నారు. చేవెళ్ల ప్రాంతానికి ఎన్నో బహుళజాతి కంపెనీలను తీసుకువచ్చి యువతకు, ఇక్కడి ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారి పరిశ్రమ నిర్మాణం జరుగుతోందన్నారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో రైల్వే కోచ్ ప్యాక్టరీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కాలే యాదయ్యను గెలిపించాలని సీఎం కేసిఆర్ కోరారు. మా పాలనను చూసి మళ్లీ యాదయ్యను గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసం. చేవెళ్ల ప్రజలు కోరుకున్న పనులన్నీ పూర్తి చేయిస్తాం. మీ అందరి ఆశీర్వాదంతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చాము. మళ్లీ ఆశీర్వదించండి తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపిపి మల్గారి విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పిటిసిలు మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, పట్నం అవినాష్‌రెడ్డి, కాలె శ్రీకాంత్, వైస్‌ఎంపిపి శివప్రసాద్, మాజీ ఎంపిపి మంగలి బాల్‌రాజ్, మండల పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అసైన్డ్ భూములకు పట్టాలు
షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో మరోమారు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోతోందని, తొలి మంత్రివర్గ సమావేశంలోనే అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లివద్ద ప్రాజెక్టును నిర్మించాలని సూచించిందే తానని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరుతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని బీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అంజయ్యయాదవ్‌ను గెలిపించాలని, గెలిపిస్తే ఈ ప్రాంత ప్రగతికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు. షాద్‌నగర్‌కు మెట్రో రైలు వచ్చేలా చూస్తానని, ఫీజీ కళాశాలలను నిర్మించి ఉన్నత విద్యను అందించేందుకు పాటుపడతామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హాబ్‌ను ఏర్పా టు చేస్తామన్నారు. షాద్‌నగర్‌లో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తవుతే ఈ ప్రాం తంలో లక్ష్మీదేవి తాంఢవం చేస్తుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అంధించడం కోసం పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యామ్ నుండి షాద్‌నగర్‌కు నీరు తీసుకురావడం జరుగుతుందన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల సంగ్రామంలో ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్యయాదవ్‌కు ఓటు వేసి అత్యధిక మె జారిటితో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధునాచారి, మాజీ ఎమ్మెల్యేలు బి.కిష్టయ్య, ఇందిరా, జెడ్పీ వైస్ చైర్మ న్ ఈట గణేష్, జెడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్, కార్పోరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, నాయకులు వాల్యానాయక్, రాజావరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

కత్తి ఒకరి చేతిలో పెట్టి…ఇంకొకరిని యుద్ధం చేయమంటే ఎట్లా?
జోగిపేట : కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్దం ఇంకొకరిని చేయమంటే ఎట్లా ..అందుకే అభివృద్ది చేసే క్రాంతి కిరణ్‌కే ఓటు వేసి గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జోగిపేటలో బీఆర్‌ఎస్ ఆద్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు సిఎం కెసిఆర్ ముఖ్యఅథితిగా హాజరై ప్రసంగించారు. ప్రజలు భారీ స్తాయిలో తరలివచ్చారు. గతంలో డాకూర్ వెళ్లే దారిలో నిర్వహించిన చోటనే సెంటిమెంట్‌గా సభ అక్కడే జరిపారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఓటు ఆయుధం లాంటిది. దానితోనే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్న విషయం మరిచిపోవద్దని ప్రజలు కోరారు. అభ్యర్థి యొక్క గుణగణాలు, వ్యక్తత్వం, నడవడిక పరిశీలించి ఓటు వేయాలన్నారు. రైతు బంధు ఉండాలంటే తిరిగి క్రాంతికిరణ్‌ను గెలిపించాలన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్‌ను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రేస్ నమ్మొద్దని చెప్పారు. కాంగ్రేస్ హయాంలో రైతులు కరెంట్ అడిగితే కాల్చి చంపారని గుర్తుచేశారు. ఇపుడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్దపడినట్లు చెప్పారు. మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ అంటుండు రైతుబంధుతో డబ్బులు వృధా అవుతున్నట్లు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి మూడుగంటలు చాలని వారి మోసపూరిత మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. వారు అధికారంలో ఉన్నపుడు చేయడం చేతకాలేదు, మేము చేస్తామంటే వద్దని అంటున్నారు. కాంగ్రేస్‌కు ఓటు వేయాలో వద్దో ఆలోచించండి. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదన్నారు. రైతులు ధరణితో గుండెమీద చేతి వేసుకొని నిద్రపోతుంటే కాంగ్రేస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని అంటున్నారని విమర్శించారు. అందోల్‌లో గెలిచి డిప్యూటి సీఎంగా హోదా అనుభవించిన దామోదర్ ఇంత కాలం ఏమి చేయలేనిది ఇపుడు ఏమి ఒరగబెడుతాడో ఆలోచించాలన్నారు. ఇతర పార్టీలవారు గెలిస్తే హైద్రాబాద్ లేదా డిల్లీకి పోతరు క్రాంతికిరణ్ లోకల్ ప్రజల మధ్యనే ఉంటడు ప్రజలు గమనించాలన్నారు. గతంలో ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి రాజ్యమేలిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అందోల్‌లో దళిత జాతి కోసం దళిత బంధు ఒకే విడలో అమలుచేస్తానని హామి ఇచ్చాడు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని, ఆ రోజు సెలవు ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బిబిపాటిల్, జడ్పీచైర్ పర్సన్ మంజూశ్రీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులతో పాటు అందరి సంక్షేమమే ధ్యేయం
సంగారెడ్డి : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో ఉద్యోగులకు అధిక వేతనాలున్నాయని, ఈ సారి గెలిస్తే వారిని మరింత ప్రోత్సహిస్తామని, అందరినీ సమదృష్టితో చూస్తామని, వారి కోసం పిఆర్‌సి కూడా వేశామని సిఎం కేసీఆర్ అన్నారు. ఉద్యోగులు ఆలోచించాలని కోరారు. సంగారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. బిజెపి వాళ్లు మత పిచ్చి గాళ్లని, ఎప్పుడు మసీదులు తవ్వుదాం..గొడవలు పెడదాం అని చూస్తారని కెసిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లేమో ప్రజల్ని ముంచుతారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు రాగానే వీరంతా ఆపద మొక్కులు మొక్కుతారని, నమ్మి ఓటేస్తే నట్టేటా ముంచుతారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్క కాలేజీ కూడా తెలంగాణాకు ఇవ్వలేదని, నవోదయ సంస్థను కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణాకు కాంగ్రెస్ శాపం అని, 1969 ఉద్యమంలో400 మందిని పొట్టన పెట్టుకుందని, ఇందిరమ్మ పాలను ఎమర్జెన్సీ తెచ్చారని, ప్రజల్ని రాచి రంపాన పెట్టారని, అలాంటి వాళ్లు కావాల్నా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారు సక్కగ ఉంటే ఎన్‌టిఆర్ టిడిపి పెట్టేవారు కాదని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చే వారు కాదన్నారు.ఆర్‌టిసి ఉద్యోగుల బాధ చూడలేక ప్రభుత్వంలో విలీనం చేశామని, గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగాలు పర్మనెంట్ చేయలేకపోయామని, ప్రభుత్వం రాగానే చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సంగారెడ్డి గడ్డ బిఆర్‌ఎస్ అడ్డాగా నిరూపించాలన్నారు. సిఎం కేసీఆర్ దార్శనికతకు దేశమంతా జేజేలు పలుకుతున్నారని, హ్యాట్రిక్ సిఎంగా చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. టిఎస్‌ఎంఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టిఎన్‌జిఓ మాజీ నేత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News