Friday, November 15, 2024

ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలనను వినియోగించుకోవాలి

- Advertisement -
- Advertisement -

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3, తేదీల్లో తలపెట్టిన ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపు ఇచ్చారు. శనివారం సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో ఓటర్లు భాగస్వాములు కావాలని ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులు పోలింగు బూతుల వద్ద ఓటర్ల జాబితాల పరిశీలన చేపడతారని, ఓటర్లు అప్రమత్తంగా ఉంటూ మార్పులు, చేర్పులు, తొలగింపులు, సక్రమంగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలని సూచించారు. పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకోవడానికి సక్రమమైన ఓటర్ల జాబితాలు కీలకమన్నారు.

ఓటర్ల జాబితాల పరిశీలనకు బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ బూత్‌లలో ఉన్న సమయంలో ఓటర్లు తప్పనిసరిగా బూత్ లకు వెళ్ళాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారుల వద్దకు వెళ్ళే సమయంలో నిబంధనల మేరకు నివాస ధృవపత్రం సహా అన్ని రకాల పత్రాలను వెంట ఉంచుకోవాలని కోరారు. జాబితాలో తమ పేర్లు , కుటుంబ సభ్యులపేర్లు లేనిపక్షంలో ఫారం 6 ను సమర్పించాలని , తమ ఇంటి నంబరులో కుటుంబానికి సంబంధంలేని వ్యక్తులపేర్లు ఉంటే వాటి తొలగింపు కోసం ఫారం 7 ను సమర్పించాలన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు బూత్ లలో చెల్లా చెదురుగా నమోదై ఉంటే ఒకే బూత్ జాబితాలోకి మార్చేందుకు ఫారం 8 సమర్పించాలని సూచించారు. సమర్పించిన ఫారాలకు తగిన రసీదు కూడా పొందాలని, రాష్ట్రంలో ఫారం 7 ను దుర్వినియోగం చేసి పలువురు అసలైన ఓటర్ల పేర్లను జాబితాల నుండి తొలగించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని , అందులో మూకుమ్మడి దరఖాస్తులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం మూకుమ్మడి తొలగింపుల పరిశీలన కోసం ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఉంటుందని, ఆ కమిటీ ఆమోదంతోనే తొలగింపులు చేపట్టాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ఓటర్లు, రాజకీయ పక్షాల కార్యకర్తలు గమనంలో ఉంచుకోవాలన్నారు. నివాస గృహంలో ఉండటం లేదన్న పేరుతో ఓటర్ల పేర్లను అధికారులు పెద్ద ఎత్తున తొలగిస్తున్న ధోరణి కనిపిస్తున్నదని , కరోనా అనంతరం ఉద్యోగ , వ్యాపార వ్యవహారాల కోసం స్వగ్రామాల నుండి , ఇంటి నుండి పని చేస్తున్నారని వారి పని పరిస్థితుల ఆధారంగా ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. అధికారుల అజాగ్రత్త కారణంగా ఓటు హక్కును కోల్పోయినట్లైతే అటువంటి ఓటర్లు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కును తిరిగి పొందవచ్చునని సూచించారు. రాష్ట్రంలో నిష్పాక్షిక , స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి చేస్తున్నదని , ఇప్పటికే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని , సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని గుర్తు చేశారు. సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో అధికారులకు , ఓటర్లకు సహకరించేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News