సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ’దూరదర్శిని’. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను గురువారం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడారు.
“ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్ అందరికి మంచి గుర్తింపు తీసుకురావాలి”అని అన్నారు. సువిక్షిత్ మాట్లాడుతూ “1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు”అని తెలిపారు. ఈ సమావేశంలో దర్శకుడు కార్తియక కొమ్మి, తిరుపతి రెడ్డి, నారాయణ, సునీల్ పొన్నం, బాలారాజు, తేజ, పాండు, జెమిని సురేష్, గీతిక, సతీష్ తదితరులు పాల్గొన్నారు.