Friday, November 22, 2024

1 నుంచి దోస్త్

- Advertisement -
- Advertisement -

జులై 1 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
సరళంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ
సందేహాల నివృత్తిని సోషల్ మీడియా వేదికలు
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరు యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 1 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్మన్ టి.పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బిఎ, బి.కాం, బి.ఎస్‌సి, బిబిఎ, బిసిఎ, బిబిఎం, బిఎస్‌డబ్లూ కోర్సులతో పాటు డి.ఫార్మసీ, డిహెచ్‌ఎంసిటి కోర్సులలో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులకు దోస్త్ సింగిల్ విండోలాంటిది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేశారు. ఆధార్ అనుసంధానం లేని ఫోన్ల నుంచి దోస్త్‌కు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.

ఆధార్ అనుసంధానం లేని ఫోన్ నెంబర్లు కలిగి ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో ఆధార్‌కు అనుసంధానం చేసుకోవచ్చరు. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహాయ కేంద్రాలు, మీ సేవా కేంద్రాలతో పాటు ఆధార్ అనుసంధానం ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి దరఖాస్తు చేసుకునే పాత విధానం కూడా అమలులో ఉంటుంది. అలాగే టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ యాప్‌లో ఫేస్ రికగ్ననైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ సౌకర్యం కేవలం తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి, అనంతరం విద్యార్థులు సెల్ఫీ ఫొటో తీసుకునే ఆప్షన్ వస్తుంది. అందులో సెల్ఫీ ఫొటోను అప్‌లోడ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
సందేహాల నివృత్తిని సోషల్ మీడియా వేదికలు
దోస్త్ రిజిస్ట్రేషన్, ఇతర అంశాలలో విద్యార్థులకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే విద్యార్థుల సందేహాల నివృత్తికి దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200ను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఈ వాట్సాప్ నెంబర్‌కు హాయ్ అని టైప్ చేసి పంపిస్తే దోస్త్ మెను వస్తుందని, అందులో విద్యార్థులు తమ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు కోరితే వారి వాట్సాప్ నెంబర్‌కు ఒటిపి, ఇతర అలర్ట్ కూడా వస్తాయి. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.
దోస్త్ ఫేస్‌బుక్ పేజీ: facebook.com/dost.telangana,
దోస్త్ ట్విట్టర్ ఖాతా : twitter.com/dost. telangana
యూట్యూబ్ : www.youtube.com/dost–_telangana
దోస్త్ వాట్సాప్ నెంబరు: 7901002200

ఇదీ దోస్త్ షెడ్యూల్

– జులై 1 నుంచి 15 వరకు రూ.200 ఫీజుతో మొదటి విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
– జులై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
– జులై 22వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
– జులై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
జులై 23 నుంచి 29 వరకు రూ.400 ఫీజుతో రెండవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
జులై 24 నుంచి 29 వరకు రెండవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
– ఆగస్టు 4వ తేదీన రెండవ విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
– ఆగస్టు 5 నుంచి 10 వరకు వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
– ఆగస్టు 5 నుంచి 10 వరకు మూడవ విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
– ఆగస్టు 6 నుంచి 11 వరకు మూడవ విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
– ఆగస్టు 18న మూడవ విడత సీట్ల కేటాయింపు
– ఆగస్టు 18, 19 తేదీలలో విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం
– ఆగస్టు 18 నుంచి 21 వరకు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు నేరుగా కళాశాలల్లో రిపోర్టింగ్ చేసేందుకు     అవకాశం
– ఆగస్టు 23 నుంచి 31 వరకు విద్యార్థులకు కళాశాలల్లో ఒరియెంటేషన్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో     తరగతులు ప్రారంభమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News