వారంలోగా నోటిఫికేషన్
ఆన్‌లైన్ ప్రవేశాలలో లోపాలు సవరించి
ప్రవేశాలు చేపట్టనున్న ఉన్నత విద్యామండలి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ -తెలంగాణ(దోస్త్) ద్వారా చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మంగళవారం(ఏప్రిల్ 22) ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏటా ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తుండగా, ఈసారి ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజుల్లో దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానున్నది.
బకెట్ విధానం తొలగింపు
దోస్త్‌లో భాగంగా డిగ్రీలో నాలుగు విభాగాల నుంచి మూడు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానం తొలగించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ విధానంలో దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు చేపడుతున్నారు. అయితే ఈ విధానంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆన్‌లైన్ ప్రవేశాలపై అవగాహన లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఉన్నత విద్యామండలి దృష్టికి రాగా, లోపాలు సవరించి ఆన్‌లైన్ విధానంలోనే డిగ్రీ ప్రవేశాలు చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో 2015- 16 విద్యా సంవత్సరం వరకు విద్యార్థులు డిగ్రీ సీట్ల కోసం డిగ్రీ కళాశాలల్లో వేర్వేరుగా దరఖాస్తులు చేసుకునేవారు.
ప్రతి కళాశాలకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. సీటు ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రతీ కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. సీటు రాకపోతే మరో కౌన్సెలింగ్ పెట్టే వరకూ అన్ని కాలేజీలూ తిరగాల్సి రావడంతోపాటు విభిన్న కోర్సుల కోసం వివిధ దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులు వ్యయ ప్రయాసలకు గురయ్యేవాళ్లు. దీనిపై విస్తృతంగా చర్చించి 2016- 17 నుంచి దోస్త్ పేరిట ఆన్‌లైన్ విధానంలో డిగ్రీ ప్రవేశాలు చేపట్టే విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1,055 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలను ఒకేచోటకు చేర్చి మెరిట్, రిజర్వేషన్ ద్వారా సీట్లను కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు రూ.200 ఫీజు చెల్లించి రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
జూన్ 16 నుంచి డిగ్రీ తరగతులు
రాష్ట్రంలో డిగ్రీ తరగతులు జూన్ 16 నుంచి ప్రారంభం కానున్నయి. డిగ్రీలోని ఆరు సెమిస్టర్ల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయించింది. తొలి సెమిస్టర్ తరగతులు జూన్ 16 నుంచి, పరీక్షలు నవంబరు 6 నుంచి మొదలవుతాయి. మూడు, ఐదో సెమిస్టర్ల తరగతులు జూన్ 2 నుంచి, రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల తరగతులు నవంబరు 20 నుంచి ప్రారంభమవుతాయి.