త్వరలో లబ్దిదారులకు పంపిణీ
మంత్రి తలసాని సమిక్షా సమావేశం
కార్యచరణ సిద్దం చేస్తున్న అధికారులు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సుదీర్ఘ కాలంగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారుల నిరీక్షణ త్వరలో తీరనుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఈ ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 2006 సంవత్సరంలో నగర వ్యాప్తంగా 10,178 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. అయితే ఇందులో పలు ప్రాంతాల్లో ఇళ్ల పూరై లబ్దిదారులకు అందజేయగా 2336 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలో నిలిచిపోయాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంబర్‌పేట నియోజకవర్గంలోని వీరన్నగుట్ట, చాంద్రాయణ్‌గుట్ట పరిధిలోని సర్వే నంబర్ 82,83,128, ఉప్పుగూడ, ఎక్స్‌సర్వీస్ మెన్ ప్రాంతాలతో పాటు గోషామహాల్ నియోజకవర్గం పరిధిలోని పూల్‌బాగ్, 1,2, మలక్‌పేట్ నియోజకవర్గంపరిధిలోని నందనవనం 2, అదేవిధంగా సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని సికింద్రాబాద్ నియోజవర్గంలోని హమాలీ బస్తీ, ననత్‌నగర్ పరిధిలోని గైదన్ బాగ్, కస్తుర్బా నగర్, ఓల్డ్ పాటిగడ్డ, ఎన్‌బిటి నగర్, కంటోన్మెంట్ పరిధిలోని ఎల్‌ఐసి కాలనీ తదితర మొత్తం 16 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాలతో నిలిచిపోయ్యాయి. దీంతో గడిచిన 16 ఏళ్లగా ఈ ఇళ్ల కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ త్వరలోనే తీరనుంది.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయాలను ఖర్చు చేసిన అప్పటీ ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదలి వేశాయి. అసంపూర్తిగా నిలిచిన పోయిన ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొలువుదీరిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ ఇళ్లకు తుది రూపును తీసుకువచ్చింది. ప్రజా ధనం వృదా కాకుండా చర్యలు తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో జిహెచ్‌ఎంసి హడ్కో నుంచి సుమారూ రూ.140 కోట్లను రుణం తీసుకుంది. ఈ నిధులతో వివిధ ప్రాంతాల్లో అసంపూర్తి గా మిగిలి పోయిన ఇళ్ల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసింది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమిక్ష
జెఎన్‌ఎన్‌ఆర్‌యుఎం ఇళ్ల పంపిణీకి సంబంధించి పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం జిల్లా కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్‌డిఓ వసంత కుమారి, ఇతర అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జెఎన్‌ఎన్‌ఆర్‌యుఎం పథకం కింద గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు గత పాలకుల అలసత్వం కారణంగా కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఈ ఇళ్ల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న లబ్దిదారులకు అందజేసేందుకు త్వరలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి సంబంధిత నియోజక వర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి అర్హులైన లబ్దిదారులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.