రూపాయి బొట్టుబిల్ల వైపా…. రూ.2016 ఆసరా పెన్షన్ కా ?
మీ ఓటు ఎటు వైపు..60 రూ. గడియారానికా.. కెసిఆర్ కిట్టుకా?
మీ ఓటు ఎటు వైపు..కుట్టు మిషన్లకా… కళ్యాణ లక్ష్మికా?
హుజూరాబాద్: దేశంలో వ్యవసాయం చేసే రైతుకు సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒక్కరే అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హుజూరాబాద్ దమ్మక్కపేట గ్రామస్థులతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ముచ్చటించారు. దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నీటి పన్ను, భూమి శిస్తు రద్దు చేసి రైతుకే పన్ను కడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. రైతుకు భరోసా ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ అని, బిజెపి, కాంగ్రెస్, టిడిపి పాలనలో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండేదన్నారు. కాళేశ్వరం నిర్మించక ముందు రైతులు సాగు నీటి విడుదల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పూర్తయ్యాక కాలువల నిండా నీరే ఉందని, ఇంక నీళ్లు వద్దని రైతులు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.
కాలంతో పని లేకుండా రెండు పంటలకు నీరు ఇస్తున్నామని, కరోనా కష్ట కాలంలోను రైతుకు రైతు బంధు ఇచ్చాం. 25 వేలలోపు రుణాలు మాఫీ చేశామని, ఇప్పుడు 50వేలలోపు రుణాలు మాఫీ చేస్తున్నామని, వచ్చే ఏడాది లక్ష రూపాయల లోపు రైతు రుణాలన్నీ వడ్డీతో సహ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా కాలంలో ప్రజలకు బియ్యం, పప్పులు వంటి వాటి పంపిణీ కోసం 2500 కోట్లు, కరోనా మందులు, ఆక్సిజన్ వంటి వాటి కోసం వేయి కోట్లు ఖర్చు చేశామన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఇళ్లు అడుగుతున్నారని, మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాలేదన్నారు. మంత్రులకు సిఎం కెసిఆర్ 4 వేల ఇళ్లు మంజూరు చేశారని, పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా 5 వేల ఇండ్లు నిర్మించారని, తాను 3600 ఇళ్లు నిర్మాణం చేపట్టానని, శ్రీనివాస్ గౌడ్ 3300 ఇండ్లు నిర్మించారని, పక్క ఎమ్మెల్యే ధర్మారెడ్డి 850 ఇళ్లు నిర్మించారని, ఇళ్లు నిర్మించని మంత్రి రాజేందర్ ఒక్కరే అని దుయ్యబట్టారు.
మీకు ఇళ్లు తప్పకుండా కట్టిస్తామని, సొంత జాగా ఉన్న వాళ్లకు కట్టిస్తామని, కట్టిన ఇళ్లను, ఇళ్లు లేక కిరాయికి ఉండే వారికి ఇస్తామన్నారు. హుజూరాబాద్ ప్రజలే ఆలోచించాలని, మంత్రిగా ఉన్నప్పుడే ఒక్క ఇళ్లు కట్టని ఈటల రాజేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ పని చేస్తారని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే బిజెపి వాళ్లు బిఎస్ఎన్ ఎల్, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయాలు, ప్రభుత్వ రంగసంస్థలు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్ని అమ్మేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు తీసివేస్తున్నాడని మండిపడ్డారు.
గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతున్నారని, గ్యాస్ ధర 950 రూ.చేసి సబ్సిడీ 250 రూపాయల నుంచి 40 రూపాయలకి తగ్గించారని మండిపడ్డారు. కెసిఆర్ రైతులకు రైతు బంధు కింద ఎకరానికి పది వేలు ఇస్తే, బిజెపి పెట్రోల్, డిజిల్ ధర పెంచి దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ టౌన్ లో లోవోల్టేజ్ సమస్య ఉందని చెబుతున్నారని, కోటీ 50లక్షల రూపాయలతో కొత్తసబ్ స్టేషను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
బొర్లపల్లి రోడ్ బాగా లేదని, మూడు కోట్లతో రోడ్ పనులకు మంజూరు చేస్తామన్నారు. నర్సింగాపూర్ రోడ్ కావాలని రైతులు అడుగుతున్నారని, బ్రిడ్జి అండ్ రోడ్ కోసం కోటీ 70 లక్షలు రూపాయలు మంజూరు చేశామన్నారు. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏళ్లు టిఆర్ఎస్ పని చేశాడని, ఉద్యమంలో అతనిపై 130 కేసులు నమోదయ్యాయి. 20 రోజులు చంచల్ గూడ, 10 రోజులు చర్లపల్లి జైలుకు వెళ్లాడని గుర్తు చేశారు. గెల్లును గెలిపించిండి. మీ అభివృద్ధి బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ఏడేళ్లలో ఎనాడు పని చేయడని రాజేందర్ పని చేస్తే… ఇవాళ గడియారాలు, కుట్టుమిషన్లు పంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఎన్నికలైన తరువాత హుజూరాబాద్ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ, సిఎం కెసిఆర్ అండగా ఉంటారని అభయమిచ్చారు.